హమాస్ చీఫ్ దారుణ హత్య
Ismail Haniyeh: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్.. హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హనియా దారుణహత్యకు గురయ్యారు. ఇస్మాయిల్‌తో పాటు ఆయన వ్యక్తిగత అంగరక్షకుడొకరు దుర్మరణం పాలయ్యారు.
టెహ్రాన్‌లో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇస్మాయిల్ బస చేసిన ఓ భవనంపై గుర్తు తెలియని వ్యక్తులు భీకర దాడికి దిగారు. ఈ దాడిలో ఆయనతో పాటు బాడీగార్డ్ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్, హమాస్ సంస్థ ధృవీకరించాయి. ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఆరోపించాయి.

ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి ఇస్మాయిల్.. ఇటీవలే టెహ్రాన్‌కు వచ్చారు. స్థానికంగా హై సెక్యూరిటీ జోన్ ప్రాంతంలో ఉండే ఓ భవనంలో బస ఏర్పాటు చేసింది టెహ్రాన్ ప్రభుత్వం. ఆయనతో పాటు హమాస్ ప్రతినిధులు కొందరు ఇక్కడే ఉంటోన్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ భవనంపై కొందరు దాడికి పాల్పడ్డారు. యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులు సాగాయి. ఈ ఘటనలో ఆయనతో పాటు అంగరక్షకుడు మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం, హమాస్, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిర్ధారించాయి.
ఇస్మాయిల్ నివసిస్తోన్న భవనంపై చోటు చేసుకున్న దాడిలో ఆయనతో పాటు బాడీగార్డ్ వీరమరణం పొందినట్లు ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా తెలియరావట్లేదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని ఐఆర్జీసీ పేర్కొంది.
ఈ హత్య పట్ల హమాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇస్మాయిల్ హత్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఆయన హత్యతో పాలస్తీనా ప్రజలు ఓ గొప్ప పోరాట యోధుడిని కోల్పోయారని నివాళి అర్పించింది. అరబ్ దేశాలకు ఇది తీరని లోటుగా అభివర్ణించింది. ఇస్మాయిల్ హత్యోదంతానికి ప్రతీకారం తప్పదనీ హెచ్చరించింది.
ఇస్మాయిల్ హత్య అనంతరం టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ప్రదర్శనలకు దిగారు. మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. ఈ హత్యోదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటివరకు చేయలేదు. ప్రత్యేక పాలస్తీనా కోసం హమాస్ ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆ దేశంపై పలుమార్లు యుద్ధానికి దిగింది హమాస్.












Click it and Unblock the Notifications