అతడి ఎత్తు 9 అడుగుల 6 అంగుళాలు - ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉన్నాడు...

అబ్దుల్

'ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి’ అనే బిరుదుకు పోటీదారుగా ఉన్న వ్యక్తిపై వచ్చిన పుకార్లు విన్నప్పుడు అవి నిజమో? కాదో? తెలుసుకోవాలని నేను అనుకున్నా.

ఘనాకు చెందిన వ్యక్తి గురించి ఈ రూమర్లు వచ్చాయి. కానీ, ఇక్కడ చిక్కేంటంటే అతని ఎత్తును కొలవడం.

29 ఏళ్ల సులేమానా అబ్దుల్ సమేద్‌ అనే వ్యక్తి ఎత్తు 9 అడుగుల 6 అంగుళాలకు (2.89 మీటర్లు) చేరినట్లు ఘనాలోని ఒక స్థానిక ఆసుపత్రి చెప్పింది.

ఇదే నిజమైతే అతను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా నిలుస్తాడు. కానీ, వారి వద్ద ఎత్తును కొలిచే సరైన సాధనాలు లేకపోవడం వల్ల అబ్దుల్ ఎత్తు గురించి ఆ ఆసుపత్రి నిక్కచ్చిగా చెప్పలేకపోయింది.

అబ్దుల్‌కు జిగాంటిజం (అసాధారణ పెరుగుదల) ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం నిర్ధారితం అయింది. ఎత్తుగా ఉండటం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కోసం అతను నెలవారీ వైద్య పరీక్షలకు హాజరు అవుతారు. ఇలాగే ఒకసారి వైద్య పరీక్షకు వెళ్లినప్పుడు ఎత్తు కొలిచే స్కేలు (కడ్డీ) పక్కన నిలబడాల్సిందిగా అతన్ని నర్సు కోరారు.

అతను దాని పక్కన నిలబడగానే చూసిన నర్సు ఆశ్చర్యపోయారు. ''నువ్వు ఈ స్కేలు కంటే ఎక్కువ ఎత్తు పెరిగావు’’ అని అబ్దుల్‌కు చెప్పారు.

అబ్దుల్

పొడవుగా అయ్యావనే మాట అతనికేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అతని పెరుగుదల ఎప్పుడూ ఆగిపోలేదు. కానీ, ఇలా జరుగుతుందని ఊహించని వైద్య సిబ్బంది మాత్రం అతని ఎత్తును చూసి గందరగోళానికి గురయ్యారు.

అబ్దుల్‌ను అందరూ 'అవుచే’ అని ముద్దుపేరుతో పిలుస్తారు. అవుచే అంటే స్థానిక భాషలో 'ముందుకు సాగు’ అని అర్థం.

అబ్దుల్ ఎత్తును కొలవడంలో సహాయం కోసం ఆ డ్యూటీ నర్సు తన సహోద్యోగిని పిలిచారు. ఆ సహోద్యోగికి కూడా ఇది సాధ్యపడలేదు. ఆయన మరో వ్యక్తిని సహాయం కోసం పిలిచారు. ఇలా అతని ఎత్తు కొలవడం కోసం నర్సులు, ఆరోగ్య సహాయకుల బృందం ఆయన ముందు గుమిగూడింది.

తర్వాత ఒక స్తంభాన్ని ఎత్తు కొలిచే స్కేలుగా ఉపయోగించి, దాని సహాయంతో అతని ఎత్తు గురించి వైద్య సిబ్బంది ఒక అంచనాకు వచ్చారు.

అబ్దుల్

''నిరంతర పెరుగుదల’’

కొన్ని నెలల క్రితం నేను 'అవుచే’ను కలిశాను. అప్పుడు అతని ఎత్తును ధ్రువీకరించేందుకు నా దగ్గర కొలిచే సాధనం (టేప్) లేదు.

అందుకే గత వారం గాంబాగా వెళ్లినప్పుడు నాతో పాటు టేప్‌ను తీసుకెళ్లాను.

అతన్ని గోడకు తగిలేలా నిల్చోబెట్టి టేపు సహాయంతో తల పైనుంచి పాదాల వరకు ఎత్తును కొలవాలని నేను అనుకున్నా.

''వారు నా ఎత్తును కొలిచిన విధానాలన్నీ కచ్చితమైనవి అని నేను చెప్పలేను’’ అని అవుచే అన్నారు.

గ్రామంలోని చాలా ఇళ్ల కంటే అబ్దుల్ ఎత్తుగా ఉంటారు. అందుకే, ఊరంతా తిరిగి ఒక ఎత్తైన ఇల్లును కనుగొన్నాం.

అతని పాదాల పొడవుకు తగిన చెప్పులు సహజంగా దొరకవు. చెప్పుల కోసం స్థానికంగా చెప్పులు తయారు చేసేవారిపైనే ఆయన ఆధారపడతారు. ఆయనకు ప్రత్యేకంగా కారు టైర్లతో స్లిప్పర్లను తయారు చేసి ఇస్తుంటారు.

కాళ్లకు చెప్పులు తీసేసి అతను గోడకు ఆనుకొని నిల్చున్నారు. అప్పుడు ఒక వ్యక్తి స్టూలుపై నిల్చుని అతని ఎత్తును కొలిచి గోడపై బొగ్గుముక్కతో గీత గీశారు.

అప్పుడు టేప్ సహాయంతో అతని ఎత్తును కొలిచాం.

''అవుచే, టేపుతో కొలిస్తే నువ్వు 7 అడుగుల 4 అంగుళాలు ఉన్నావు’’ అని నేను అతనితో అన్నాను.

''వావ్, అంటే దానర్థం ఏంటి?’’ అని నవ్వుతూ అతను నన్ను అడిగారు.

''ప్రస్తుతం బతికి ఉన్న అత్యంత పొడవైన వ్యక్తి ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. అంటే అతను దాదాపుగా మీ కంటే కేవలం ఒక అడుగు మాత్రమే ఎక్కువ ఎత్తు ఉంటారు’’ అని నేను అబ్దుల్‌కు వివరంగా చెప్పాను.

గిన్నిస్ రికార్డు ప్రకారం, టర్కీలో నివసిస్తోన్న 40 ఏళ్ల సల్తాన్ కోసెన్, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.

''నేను ఇంకా పెరుగుతూనే ఉన్నా. ఒకరోజు నేను కూడా అతని ఎత్తుకు చేరుకుంటానేమో ఎవరికి తెలుసు?

ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకు నేను పెరుగుతుంటా. ఒక నాలుగు నెలల తర్వాత మీరు నన్ను చూస్తే నేను ఎత్తు పెరిగినట్లు మీరు గుర్తిస్తారు’’ అని అబ్దుల్ వివరించారు.

అబ్దుల్

నాలుక పెరుగుదల

22 ఏళ్ల వయస్సున్నప్పుడు అబ్దుల్, ఘనా రాజధాని అక్రాలో ఉండేవారు. అప్పుడే అతని నిరంతర పెరుగుదలను గుర్తించడం ప్రారంభించారు.

అక్రాలో అబ్దుల్ సోదరుడు ఒకరు ఉంటారు. సెకండరీ స్కూల్ పూర్తి చేసిన తర్వాత అబ్దుల్ అక్కడికి వెళ్లారు.

డ్రైవింగ్ స్కూల్‌లో చేరేందుకు కావాల్సిన డబ్బు కోసం అతను ఒక మాంసం కొట్టులో పనిచేసేవారు.

అప్పుడు ఒకరోజు ఉదయం చాలా ఆందోళనగా నిద్ర లేచినట్లు ఆయన చెప్పారు.

''నా నాలుక పొడవు అయినట్లు నాకు అనిపించింది. ఊపిరి తీసుకోలేనంతగా నోటిలో అది విస్తరించింది’’ అని అబ్దుల్ గుర్తు చేసుకున్నారు.

వెంటనే తగిన మందుల కోసం స్థానిక మందుల దుకాణానికి వెళ్లినట్లు చెప్పారు. ఇది జరిగిన కొన్నిరోజులకే, తన శరీరంలోని ప్రతీ భాగం పెరుగుతున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.

అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా అతని ఎత్తులో వస్తున్న మార్పును గుర్తించారు. అందరూ అదే విషయం అతనితో చెప్పారు. దీంతో తను క్రమంగా ఎత్తు పెరుగుతున్నట్లు ఆయన గ్రహించారు.

ఈ పెరుగుదల ఆయన వెన్నెముక వంగిపోయింది. మర్ఫాన్ సిండ్రోమ్ (కణజాలాలను ప్రభావితం చేసే జన్యుపర సమస్య) వంటి ఇతర సమస్యలను తెచ్చిపెట్టడంతో ఆయన వైద్య సహాయాన్ని ఆశ్రయించారు.

అబ్దుల్

నిరంతరం ఎత్తు పెరగడం అనే అసాధారణ పరిస్థితి వల్ల గుండెకు కూడా ప్రమాదమే.

అతని పెరుగుదలను ఆపేందుకు మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు.

కానీ, ఈ శస్త్రచికిత్సకు ఘనా ప్రజారోగ్య వైద్య సంరక్షణ బీమా వర్తించదు. ప్రాథమిక చికిత్సలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రతీసారి ఆయనకు 50 డాలర్లు (రూ. 4,137) ఖర్చు అవుతుంది.

ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ఆరేళ్ల క్రితం తిరిగి సొంత గ్రామానికి రావాల్సి వచ్చింది. చివరకు డ్రైవర్ అవ్వాలనే ఆశను కూడా ఆయన వదిలేసుకున్నారు.

''నేను డ్రైవర్ అవ్వాలనుకున్నా. కానీ నేను సీటును వెనక్కి జరిపి కారులో కూర్చున్నప్పటికీ స్టీరింగ్‌ను పట్టుకోలేను. ఎందుకంటే నా మోకాళ్లు స్టీరింగ్‌కు తగులుతాయి. కాబట్టి కారులో కాళ్లను చాచి కూర్చోలేను’’ అని ఆయన చెప్పారు.

అబ్దుల్, తన సోదరునితో కలిసి ఉంటున్నారు. మొబైల్ ఫోన్ రీచార్జ్ వంటి చిన్న వ్యాపారాన్ని చేస్తున్నారు.

ఎత్తు కారణంగా సామాజిక జీవితాన్ని కూడా ఆయన కోల్పోతున్నారు.

''అందరి పిల్లల్లాగే నేను కూడా ఫుట్‌బాల్ ఆడేవాడిని. నేను ఒకప్పుడు అథ్లెట్‌ను. కానీ, ఇప్పుడు కొంచెం దూరం కూడా నడవలేను’’ అని ఆయన చెప్పారు.

అబ్దుల్

సెలెబ్రిటీ

ఎత్తు కారణంగా వస్తోన్న సమస్యలతో అబ్దుల్ కుంగిపోవట్లేదు. ఆయన తన సమస్యలను నవ్వుతూ ఎదుర్కొంటున్నారు.

స్థానికంగా ఆయనొక చిన్న సెలెబ్రిటీగా మారిపోయారు.

వీధుల్లో ఆయన కనిపించినప్పుడు వృద్ధులు, పిల్లలు, మహిళలు ఆయనతో మాట్లాడేందుకు వస్తారు.

కొంతమంది ఆయనతో సెల్ఫీలు తీసుకోవాలని అనుకుంటారు. చివరకు అపరిచితులు కూడా వచ్చి ఆయనతో మాట కలుపుతారు.

''మాములుగా నేను అందరినీ దగ్గరగా నిలబడమంటాను. తర్వాత ఫొటోలు దిగుతాం’’ అని అవుచే చెప్పారు.

అసాధారణ పరిస్థితిని కూడా సాధారణంగానే పరిగణిస్తూ మానసికంగా మద్దతు అందిస్తోన్న తన కుటుంబానికి ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని అబ్దుల్ అన్నారు.

''మా కుటుంబంలో ఎవరూ పొడగరులు కారు. నేను మాత్రమే బాగా ఎక్కువ ఎత్తు ఉన్నా.

ఏదో ఒకరోజు పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నా. అయితే, ముందుగా ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా.

దేవుడు నన్ను సృష్టించిన విధానంతో నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+