కూతురు ఇవాంకా సలహాలతో తగ్గిన ట్రంప్ దూకుడు.. నిజమేనన్న వైట్ హౌస్ వర్గాలు
అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించిన సమయంలో ఆయన స్వరం తగ్గడానికి కారణం ఆయన కూతురు ఇవాంకా అని అందరూ అనుకుంటున్నారు.
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించిన సమయంలో ఆయన స్వరం తగ్గడాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. గతంలో ఉన్న వాడీ వేడీ ఈసారి ఆయన స్పీచ్ లో కనిపించలేదు.
దీని వెనక ఉన్న కారణమేమిటా అని చాలామంది చాలా రకాలుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. కానీ దీని వెనక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు వైట్ హౌస్ అధికారులే వెల్లడించారు. ట్రంప్ స్వరం తగ్గడానికి కారణం ఆయన కూతురు ఇవాంకా అని వాళ్లు స్పష్టం చేశారు.
ట్రంప్ కు ఆయన కూతురు ఇవాంకా అనధికారిక సలహాదారుగా వ్యవహరిస్తోంది. నిజానికి ట్రంప్ ప్రసంగాన్ని రూపొందించడానికి పది రోజుల సమయం పట్టిందట. జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి స్పీచ్ కి.. ఇప్పటి స్పీచ్ కి స్పష్టమైన వ్యత్యాసం కనిపించడానికి ఇదే ప్రధాన కారణమట.

తన ప్రసంగంలో తరచూ డెమొక్రాట్లు, మీడియాపై ట్రంప్ చేసే విమర్శలు ఈసారి ఈ ప్రసంగంలో వినిపించలేదు. ట్రంప్ ప్రసంగం ముగియగానే పోల్ లో చాలామంది ఈ మార్పును స్వాగతించారు.
ఆదివారం ఈ ప్రసంగంపై ఓవల్ ఆఫీసులో జరిగిన చర్యలో ఇవాంకా కీలకమైన సూచనలు చేసిందని, ట్రంప్ కొత్త విధానాన్ని రూపొందించింది ఆమేనని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఎంతోమంది ఆయన చుట్టూ చేరి సలహాలు, సూచనలు చేసినా.. ట్రంప్ మాత్రం తన కూతురి మాటనే విన్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా చైల్డ్ కేర్, పెయిడ్ ఫ్యామిలీ లీవ్ వంటి విషయాల్లో సానుకూలంగా మాట్లాడాలని ఇవాంకా సూచించినట్లు మరో అధికారి తెలిపారు.
మహిళలు, మైనారిటీలకు సంబంధించిన విషయాల్లో ఇవాంకా కీలకమైన సూచనలు చేస్తోందని, నిజానికి ట్రంప్ ప్రచారంలో కూడా ఇవాంకా కీలక పాత్ర పోషించిందని, ఆయన గెలిచిన తరువాత తన కుటుంబ వ్యాపారం నుంచి దూరం జరిగి ట్రంప్ అనధికార సలహాదారుగా వ్యవహరిస్తోందని వైట్ హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ట్రంప్ తన ప్రసంగాన్ని తానే రూపొందించుకున్నప్పటికీ.. కూతురు ఇవాంకా సలహాలను మాత్రం కచ్చితంగా పాటిస్తున్నట్లు ఆయన వివరించారు. క్యాపిటల్ హిల్ కు వెళ్లే ముందు ట్రంప్ తో పాటు కారులో ఇవాంకా కూడా ఉంది. ఈ ప్రసంగం రూపకల్పనలో ఇవాంకా భర్త, వైట్ హౌస్ సీనియర్ అడ్వయిజర్ కుష్నెర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు.












Click it and Unblock the Notifications