చేయని నేరానికి 43 ఏళ్లు జైలులోనే.. ఇప్పుడు దేశ బహిష్కరణ!
అమానుషమైన అన్యాయానికి, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని కఠినత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం వేదం (64) కేసు తాజాగా ఉపశమనం పొందింది. హత్య కేసులో తప్పుడు నిర్ధారణ కారణంగా 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదలైన వేదంను దేశం నుంచి బహిష్కరించవద్దని రెండు యూఎస్ కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి. సుబ్రమణ్యం వేదం జీవితంలో జరిగిన ఈ విషాదకర ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
నిర్దోషిగా జైలు శిక్ష
సుబ్రమణ్యం వేదం కేవలం 9 నెలల వయసులో చట్టబద్ధంగా భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) పొందారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఆయన తండ్రి ప్రొఫెసర్‌గా పనిచేయడంతో, అక్కడే పెరిగిన వేదం 1982లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే అరెస్ట్ అయ్యారు.

కేసు నేపథ్యం ఇలా..
1980లో ఆయన ఫ్రెండ్ థామస్ కిన్వర్ హత్యతు గురయ్యాడు. చివరిసారిగా కిన్సర్‌తో కనిపించిన వ్యక్తి సుబ్రమణ్యం వేదం కావడంతో బలమైన ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా, పోలీసులు అతడిని నిందితుడిగా చేర్చారు. 1983లో కోర్టు రెండుసార్లు అతడిని దోషిగా నిర్ధారించింది. ఫలితంగా పెరోల్ లేకుండా జీవిత ఖైదు పడింది. 40 ఏళ్లకు పైగా జైలులో ఉండి న్యాయం కోసం పోరాడిన సుబ్రమణ్యం వేదం తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు దశాబ్దాలుగా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన కీలకమైన బాలిస్టిక్స్ ఆధారాలను ఇటీవల బయటపెట్టారు. ఈ ఆధారాల వల్ల సుబ్రమణ్యం వేదం నిర్దోషి అని నిరూపణ అయ్యింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో న్యాయమూర్తి ఆయన శిక్షను రద్దు చేసి, నిర్దోషిగా ప్రకటించారు.
ఒక అన్యాయం ముగియకముందే మరొకటి
అక్టోబర్ 3న పెన్సిల్వేనియా జైలు నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాల్సిన సుబ్రమణ్యం వేదంను అప్పటికే సిద్ధంగా ఉన్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. బహిష్కరణల కోసం ప్రత్యేకంగా ఎయిర్‌స్ట్రిప్ ఉన్న లూసియానాలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఐసీఈ అధికారులు సుబ్రమణ్యం వేదంను బహిష్కరించడానికి కారణం ఆయన సుమారు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎల్‌ఎస్‌డీ డెలివరీకి సంబంధించిన డ్రగ్స్ కేసులో గతంలో దోషిగా నిర్ధారించబడటమే. హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన, ఈ పాత డ్రగ్స్ కేసు శిక్ష రద్దు కాదని, అందుకే బహిష్కరణకు అర్హుడని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
న్యాయవాదుల వాదన.. కోర్టుల జోక్యం
సుబ్రమణ్యం వేదం తరఫున లాయర్లు, ఆయన సోదరి సరస్వతి వేదం ఐసీఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తి విషయంలో ఈ పాత చిన్నపాటి డ్రగ్స్ కేసును పరిగణనలోకి తీసుకోరాదని వారు వాదించారు. జైల్లో ఉన్నప్పుడే ఆయన మూడు డిగ్రీలు సంపాదించి, తోటి ఖైదీలకు ట్యూటర్‌గా సేవలందించారని, అతని సుదీర్ఘమైన తప్పుడు నిర్బంధాన్ని పరిగణించాలి అని కోర్టును అభ్యర్థించారు.
ఈ వాదనల నేపథ్యంలో, తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సుబ్రమణ్యం వేదం బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.పెన్సిల్వేనియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఆయన బహిష్కరణపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications