అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ (Kamala Harris) ఖరారయ్యారు. దీంతో నవంబర్ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78)తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చువల్ రూల్ కాల్‌లో ఆమె సాధించినట్లు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ చైర్ జేమ్ హరిసన్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష నామినీగా కమలా హారీస్ పేరు ప్రకటించడం లాంఛనమైంది. డెలిగేట్ ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే మెజార్టీ ఓట్లను పొందినట్లు జేమ్ హారిసన్ వెల్లడించారు. చికాగోలో ఈ నెలాఖరున జరగనున్న కన్వెన్షన్ లో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు.

పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ మెయిల్ ద్వారా ఓటింగ్ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం సాయంత్రం ముగియనుంది. అయితే, తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారీస్ ఇంతవరకు ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. ఈ వారాంతంలో ఆమె నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికార నామినేషన్ ఆగస్టు 7తో ఖరారు కానుంది. నామినేషన్ కోసం ఇప్పటి వరకు ఆమెకు పోటీలో దరిదాపుగా ఎవరూ లేరు.
తాజా పరిణామాలపై కమలా హారీస్ స్పందిస్తూ.. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశం పట్ల ప్రేమతో, ఉత్తమమైన దానికోసం పోరాడే వ్యక్తులను ఒక్కటి చేయడమే తన ప్రచార ఉద్దేశమని తెలిపారు. తాము తమ దేశాన్ని ప్రేమిస్తామని, అమెరికా వాగ్ధానాన్ని విశ్వసిస్తామని కమలా హారీస్ పేర్కొన్నారు. ఈ నెలలో చికాగోలో తాము సమావేశం అవుతామని, అందరం ఒక్కపార్టీగా నిలబడతామని వివరించారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని వేడుకగా చేసుకుంటామన్నారు.
రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు కమలా హారీస్. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశాల మూలాలున్న మహిళగా కమలా హారీస్ చరిత్రకెక్కనున్నారు. మరోవైపు, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇటీవల ట్రంప్.. కమలా హారీస్ జాతీయతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications