బంకర్ లోకి పుతిన్
రష్యా రాజధాని మాస్కో నడిబొడ్డున క్రెమ్లిన్ భవనాలపై రెండు డ్రోన్లు దూసుకురావడం సంచలనం సృష్టించింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న ఈ కీలక భవనాలపై ఈ తరహా దాడికి ప్రయత్నం జరగడంపై రష్యా ఉలిక్కిపడింది. ఈ విషయంలో అమెరికాపై రష్యా విరుచుకు పడింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తోందని, వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాల గురించి రష్యాలకు తెలుసనే విషయం వాషింగ్టన్ తెలుసుకోవాలని పెస్కోవ్ అన్నారు. ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉందని, అంతేకాకుండా తమదగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయన్నారు. ప్రస్తుత దాడిపై తక్షణమే విచారణ జరుగుతోందని తెలిపారు.

క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఖండించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అతడి గుంపును చంపడం మినహా తమ వద్ద మరో అవకాశం లేదని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. బేషరతుగా లొంగిపోయే పత్రంపై జెలెన్ స్కీ సంతకం చేయాల్సిన అవసరం లేదని, తమ దగ్గర ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుందన్నారు.
క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. పుతిన్‌ను బంకర్‌లోకి తరలించారు. నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించారు.












Click it and Unblock the Notifications