వీసా-ఫ్రీ ఎంట్రీతో ఇక్కడికి ఉద్యోగాలకు రావద్దు: భారతీయులకు హైకమిషన్ హెచ్చరిక..!
భారతీయులకు దాదాపు 80 దేశాలు వీసా లేకుండానే తమ దేశంలోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు తాత్కాలికంగా, మరికొన్ని దేశాలు శాశ్వతంగా ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మలేషియా (Malaysia) కూడా 30 రోజుల వీసా-ఫ్రీ సదుపాయాన్ని భారతీయులకు కల్పించింది. అయితే ఇలా వీసా ఫ్రీ ఉంది కాబట్టి మలేషియాకు వెళ్తున్న భారతీయులు.. అక్కడ ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నారు. దీనిపై భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది.
వీసా ఫ్రీ సదుపాయాన్ని ఉపయోగించుకుని మలేషియాకు ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ తెలిపింది. కేవలం పర్యాటక కారణాలతో జారీ చేస్తున్న అనుమతితో మలేషియాకు వెళ్లి ఉద్యోగాలు చేయవద్దని భారతీయులను హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే కొందరు మోసపూరిత ఏజెంట్ల మాటలను నమ్మి పలువురు భారతీయులు మలేషియాకు వెళ్తున్నారని హైకమిషన్ పేర్కొంది. దీంతో వారు వీసా గడువు దాటడం, అక్రమ వలస స్థితిలోకి వెళ్లడం, దోపిడీకి గురికావడం, నిర్బంధం, చట్టపరమైన చర్యలు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

భారత పాస్‌పోర్ట్‌దారులకు మలేషియాలో 30 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రవేశం పర్యాటకం, సామాజిక సందర్శనల కోసం మాత్రమే వర్తిస్తుందని హై కమిషన్ స్పష్టంచేసింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించి ఉద్యోగం చేయడం మలేషియా ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. నిజమైన పర్యాటకులు మలేషియాకు వెళ్లే సమయంలో ధృవీకరించే రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, మలేషియా డిజిటల్ అరైవల్ కార్డు (MDAC) ఆన్‌లైన్ సమర్పణ రుజువు, కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్ వంటి పత్రాలను వెంట తీసుకెళ్లాలని హైకమిషన్ సూచిస్తోంది. అరైవల్ కార్డును ప్రయాణానికి మూడు రోజుల ముందు సమర్పించాలని సూచిస్తోంది. వర్క్ పర్మిట్ లేదా వీసా విత్ రిఫరెన్స్ లేకుండా ఉద్యోగం కోసం మలేషియాకు ప్రయాణించవద్దని భారతీయులకు హైకమిషన్ తేల్చిచెప్పేసింది.














Click it and Unblock the Notifications
