కుక్క పిల్లలని పెంచితే.. ఎలుగుబంటి పిల్లలయ్యాయి
బీజింగ్: చైనాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ కుక్క పిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నాయని ముచ్చటపడి తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తిండి పెట్టి పెద్ద చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత అవి ఎలుగుబంట్లుగా మారడంతో అవక్కయ్యాడు. తాను ఇన్నేళ్లు పెంచినవి కుక్క పిల్లలు కాదు, ఎలుబంటి పిల్లలు అని తెలుసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని యున్నన్‌కు చెందిన వాంగ్ కైయూ అనే వ్యక్తి 2013లో చైనా, వియత్నాం సరిహద్దు ప్రాంతంలో అరటి మొక్కలు నాటేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన రెండు జంతువులను చూశాడు. అవి అచ్చం కుక్కపిల్లల్లాగే ఉండటంతో కుక్క పిల్లలే అనుకుని, ముచ్చటపడి తెచ్చి పెంచుకున్నాడు.

ఏకంగా రెండు సంవత్సరాలు వాటిని పెంచాడు. రెండేళ్ల తర్వాత ఆ పిల్లలు బలంగా తయారై క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. అప్పటికే ఇరుగు పొరుగువారు వాటిని ఎలుగుబంట్లని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న వాంగ్ కూడా పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో పోలీసులు వాటిని యున్నన్‌లోని జంతువుల సంరక్షణాకేంద్రానికి తరలించారు. అవి ఆసియాలోని నల్ల ఎలుగుబంటి జాతికి చెందినవని, అవి అతి క్రూరమైనవని సంరక్షణాకేంద్రం అధికారులు తెలిపారు. కాగా, తాను పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నానని.. వాంగ్ కైయూ ఆనందం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications