మాస్టర్ స్ట్రోక్: రష్యాపై కంటికి కనిపించని మహాయుద్ధం: ఉక్కిరిబిక్కిరి
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు, నిషేధాల పర్వం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆరంభించిన తొలిరోజు నుంచే ఆరంభమైన ఆంక్షలు- మరింత తీవ్రతరం అయ్యాయి. మరింతగా విస్తరించాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాపై అన్ని రకాలుగా ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. ఆ దేశ విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. రష్యా నుంచి దిగుమతులను పాక్షికంగా నిషేధించాయి.

ఇటలీ, సింగపూర్..
ఈ పరిణామాల మధ్య- రష్యాపై ఆంక్షలను విధించిన జాబితాలో ఇటలీ, సింగపూర్ కూడా చేరాయి. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్న ఇటలీ- ఇప్పటిదాకా రష్యాపై ఆంక్షలను అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా ఉత్తర్వులను జారీ చేసింది. రష్యన్ ఒలిగార్స్‌కు చెందిన అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేయాలంటూ అన్ని బ్యాంకులకూ ఆదేశాలు వెళ్లాయి. బ్యాంక్ ఆఫ్ ఇటలీ- ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా వారి బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయాలంటూ ఆదేశించింది.

ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులపై సింగపూర్ బ్యాన్
ఉక్రెయిన్‌కు హాని కలిగించడానికి ఉపయోగించే ఆయుధాలతో పాటు సైబర్ కార్యకలాపాల్లో వినియోగించే పరికరాలను ఇక ముందు రష్యాకు సరఫరా చెయ్యబోమని సింగపూర్ స్పష్టం చేసింది. వాటిపై తాత్కాలికంగా నిషేదం విదిస్తున్నామని సింగపూర్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. సైనికులు ఉపయోగించే వస్తులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ జాబితాలోని అన్ని వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నామని సింగపూర్ కస్టమ్స్ అధికారులు తేల్చి చెప్పారు.

తొలుత పేపాల్..
పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ పేపాల్ కూడా తన సేవలన్నింటినీ రష్యాలో షట్‌డౌన్ చేసింది. తమ కంపెనీ సర్వీసులు ఏవీ కొంతకాలం పాటు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడటాన్ని తాము సమర్థించట్లేదని, రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన అంతర్జాతీయ సమాజంతో తాము కూడా జత కలిశామని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డ్యాన్ షుల్మన్ తెలిపారు.

అదే బాటలో మాస్టర్ కార్డ్, విసా..
పేపాల్ బాటలోనే విసా, మాస్టర్ కార్డ్ కూడా నడిచాయి. ఈ రెండు సంస్థలు కూడా రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు సమాచారాన్ని ఇచ్చాయి. రష్యా బ్యాంకులు జారీ చేసిన విసా, మాస్టర్ కార్డులేవీ పని చేయబోమని స్పష్టం చేశాయి. తమ నెట్‌వర్క్స్ ఎంతో కాలం పాటు అందుబాటులో ఎండబోవని తేల్చి చెప్పాయి. రష్యా స్టోర్స్ లేదా ఏటీఎంలల్లో మాస్టర్ కార్డ్ సేవలు పని చేయబోవని పేర్కొన్నాయి.
తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు..
రష్యాలో తమ సేవలను నిలిపివేయాలనేది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని మాస్టర్ కార్డ్ యాజమాన్యం పేర్కొంది. ఈ విషయంలో తాము వినియోగదారులు, భాగస్వామ్య కంపెనీలు, స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వాలను సంప్రదించిన తరువాతే ఈ దిశగా చర్యలు చేపట్టామని వివరించింది. విసా కార్డ్ మేనేజ్‌మెంట్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో విసా కార్డ్ సేవలు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేర్కొంది. ఉక్రెయిన్‌పై చేస్తోన్న దాడులు సమర్థనీయం కాదని విసా ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్ కెల్లి చెప్పారు.

ప్రైవేట్ వీడియో తరువాతే..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ- అమెరికా సెనెటర్లతో ఓ ప్రైవేట్ వీడియో ద్వారా సంప్రదింపులు జరిపిన తరువాతే విసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కూడా 16 నిమిషాల వ్యవధిలోనే తమ నిర్ణయాలను వెల్లడిస్తూ వేర్వేరుగా ప్రకటనలను జారీ చేసినట్లు తెలిపాయి. జెలెన్‌స్కీ తమతో మాట్లాడినట్లు కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ తెలిపారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.












Click it and Unblock the Notifications