మూడేళ్లలో ట్రంప్ ఖేల్ ఖతం.. మరో 40 ఏళ్లు మనవే.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొన్నటి వరకూ బ్రోమాన్స్ అంటూ కలిసి పని చేసిన దిగ్గజాలు ఇప్పుడు నువ్వా నేనా అనే స్థాయికి చేరారు. ఇరువురు ఒకరిపై మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్స్ చేసుకుంటున్నారు. దీంతో ట్రంప్, మస్క్ మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
తాజాగా మరోసారి ట్రంప్ ను ఉద్దేశించి మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మూడో పార్టీ అవసరం అని అన్నారు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ తో పాటు దేశంలోని 80శాతం ప్రజల కోసం మరో పార్టీ అవసరం అని తెలిపారు. ట్రంప్ కు అమెరికా అధ్యక్షుడిగా ఇంకో మూడున్నరేళ్లు మాత్రమే ఉందని.. కానీ నాకు 40 ఏళ్ల కంటే ఎక్కువ సమయం అర్హత ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఓ విధంగా చెప్పాలంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎలాన్ మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ కు మద్దతుగా బహిరంగ సభలు పెట్టి ట్రంప్ కు ఓటేయాలన్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కృషి చాలానే ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) వ్యవస్థను ఏర్పాటు చేసి.. ఈ వ్యవస్థ బాధ్యతలను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. ఈ వ్యవస్థ అమెరికా ప్రభుత్వంలో అనవసర ఖర్చులు తగ్గించడం, అనవసర ఉద్యోగాలను తొలగించడం చేసేది.
కొన్నాళ్ల వరకూ ఇద్దరూ కలిసి రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో కీలక మార్పులు తీసుకున్నారు. కానీ ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్ష ధోరణిపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ది బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లు తీసుకురావడం ఎలాన్ మస్క్ కు నచ్చలేదు. ఈ క్రమంలో మస్క్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) వ్యవస్థ నుంచి వైదొలిగారు.

అంతేకాక ట్రంప్ తీసుకొచ్చిన "బిగ్ బ్యూటిపుల్ బిల్" తన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని, ఇది అమెరికా రుణాన్ని తగ్గిస్తుందనుకుంటే అది మరింత పెంచుతుందని మస్క్ తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. మరి మస్క్, ట్రంప్ మధ్య సయోధ్య కుదిరేందుకు ఇంకెంత కాలం పడుతుందో వేచి చూడాలి. తాజాగా ట్రంప్ కు వ్యతిరేకంగా చేసిన పలు ట్వీట్స్ ను మస్క్ డిలీట్ చేశారు. దీంతో ట్రంప్ కు మస్క్ భయపడ్డారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications