క్రయోనిక్స్‌లో పునర్జన్మకు తొలి అడుగు!
మరణించిన మనిషికి ప్రాణం పోయగలిగితే? మృతదేహాన్ని భద్రపరిచి వైద్యం చేసి బతికించి పునర్జన్మ ప్రసాదించగలిగితే?.. ఎంతో బాగుంటుంది కదా.. పురాణ గాథలు, కథలు, ఊహలు,
బీజింగ్: మరణించిన మనిషికి ప్రాణం పోయగలిగితే? మృతదేహాన్ని భద్రపరిచి వైద్యం చేసి బతికించి పునర్జన్మ ప్రసాదించగలిగితే?.. ఎంతో బాగుంటుంది కదా.. పురాణ గాథలు, కథలు, ఊహలు, సినిమాలకు మాత్రమే పరిమితమైన పునర్జన్మ భావన త్వరలోనే వాస్తవరూపం దాల్చనున్నదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెప్తున్నారు.
ప్రపంచానికి ఏళ్లతరబడి చిక్కుముడిగా మారిన ఈ పునర్జన్మపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఓ ముందడుగు వేశారు. చైనా శాస్త్రవేత్తలు తొలిసారి ఓ మహిళ మృతదేహాన్ని క్రయోనిక్స్ విధానంలో గడ్డకట్టించారు. వ్యక్తి గుండెకొట్టుకోవడం ఆగిపోయిన సెకన్ల గడువులో రసాయనాలతో శరీరాన్ని గడ్డకట్టించడమే క్రయోనిక్స్ అంటారు. ఈ విధానంలో మృతదేహం ఏండ్ల తరబడి ఉన్నా పాడైపోదని అంటున్నారు.

జెన్ వెన్లియాన్ మృతదేహానికి ఇలా క్రయోనిక్స్ అమలు
చైనాలో ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించిన జెన్ వెన్లియాన్ (49) అనే మహిళ మృతదేహాన్ని జినాన్ లోని యిన్‌ఫెంగ్ బయలాజికల్ గ్రూప్ ల్యాబ్‌లో క్రయోనిక్స్ విధానంలో భద్రపరిచేందుకు 2000 లీటర్ల ద్రవరూప నైట్రోజన్ ఉపయోగించారు. భవిష్యత్‌లో ఆమెకు పునర్జన్మ ప్రసాదిస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీజర్, ఐస్ కంటే ద్రవరూప నైట్రోజన్‌లో ముంచితే శరీరం కొన్ని సెకండ్లలోనే పూర్తిగా గడ్డకడుతుంది. ఇందులో గ్లిజరాల్, ప్రొపండియోల్ వంటి రసాయనాలను కలిపితే శరీర కణాలు పాడు కావు. దీంతో మృతదేహాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే ఏండ్లపాటు కాపాడొచ్చు. చైనాలోని యిన్‌ఫెంగ్ బయలాజికల్ గ్రూప్, షండాంగ్ వర్సిటీ, అమెరికా ఆల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ సభ్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది.
క్రయోనిక్స్‌తో మరణం ఇలా వాయిదా
గుండె కొట్టుకోవడం ఆగిపోగానే మరణ ప్రక్రియ పూర్తి కాదని, శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలన్నీ పూర్తి అచేతనంగా మారడానికి కొంత టైమ్ పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్రయోనిక్స్ విధానంలో జెన్ వెన్లియాన్ మరణ ప్రక్రియను వాయిదా వేశామన్నారు. జెన్ గుండె మాత్రమే కొట్టుకోవడం మానేసిందని, మిగతా అవయవాలు అచేతనంగా మారకముందే గడ్డకట్టించామని అన్నారు.
పునర్జన్మపై మాత్రం కొరవడిన ప్రణాళిక
శాస్త్రవేత్తలు క్రయోనిక్స్ పద్ధతిలో మృతదేహాన్ని భద్రపరిచినా, ఆమెకు పునర్జన్మ ఎలా ప్రసాదిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిజానికి వారి వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదు. భవిష్యత్ అవసరాల కోసమే ఆమె శరీరాన్ని భద్రపరిచామని చెప్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేయించలేమని.. కానీ భవిష్యత్‌లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయగలుగుతామని పేర్కొన్నారు. అప్పుడు జెన్ వెన్లియాన్‌కు పునర్జన్మ ప్రసాదిస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications