కామ్రెడ్ కమల తడాఖా: డొనాల్డ్ ట్రంప్ రివర్స్ గేర్?
Donald Trump-Kamala Harris debate 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
నవంబర్‌లో..
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే.

90 నిమిషాల పాటు..
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా దీనికి వేదికగా వీరిద్దరి మధ్య తొలి డిబేట్ జరిగింది. ఇద్దరు నేతలూ వాడివేడిగా చర్చల్లో పాల్గొన్నారు. అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థ, అమెరికాను కలవరపాటుకు గురి చేస్తోన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, విదేశాంగ విధానం, చైనాతో సంబంధాలు వంటి విషయాలపై 90 నిమిషాల పాటు చర్చ సాగింది.
అనేక అంశాలు..
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2016- 2020 మధ్య కాలంలో ఆయన అనుసరించిన విదేశాంగ విధానంతో ఎదురుదాడికి దిగారు. ట్రంప్ హయాంలో ఖజానా ఖాళీ అయిందని, నిరుద్యోగం, ఆర్థిక భారం పడటానికి ఆయన పరిపాలనే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. ఆయన పరిపాలనలో ప్రజారోగ్యం అత్యంత దారుణంగా మారిందని కమలా హ్యారిస్ ధ్వజమెత్తారు.
మరో డిబేట్‌కు నో..
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నారో.. ఏమో- కమల హ్యారిస్‌తో రెండోసారి డిబేట్‌లో పాల్గొనడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించట్లేదు. ఆమెతో మరో డిబేట్ ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
నేనే గెలిచా..
తొలి డిబేట్‌లో తాను పైచేయి సాధించానని, అందులో ప్రస్తావనకు వచ్చిన పలు కీలకాంశాలకు కమలా హ్యారిస్ వద్ద సమాధానం లేకుండాపోయిందని ట్రంప్ చెప్పారు. అందులో ఓటమి ఎదురు కావడం వల్లే తనను మరోసారి డిబేట్‌కు ఆహ్వానిస్తోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కామ్రెడ్ కమల..
కమల హ్యారిస్‌ను కామ్రెడ్ అంటూ అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ఒక మ్యాచ్ ఓడిపోయిన తరువాత దాన్ని మరోసారి నిర్వహించాలంటూ ఫైటర్లు పట్టుబట్టుతుంటారని, కమలా హ్యారిస్ వ్యవహారం అలాగే కనిపిస్తోందని సెటైర్లు వేశారు. ఆ డిబేట్ సందర్భంగా తాను గెలిచానంటూ పోల్స్ అన్నీ కూడా స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక వ్యవస్థ ధ్వంసం..
జో బైడెన్- కమలా హ్యారిస్ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్స్, మానిసక సమతౌల్యాన్ని కోల్పోయిన వాళ్లు దేశంలో బాహటంగా తిరుగుతున్నారని విమర్శించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల మధ్య తరగతి కుదేల్ అయిందని ధ్వజమెత్తారు.
డిబేట్లకు బదులుగా..
అధికారం చివరి రోజుల్లో అయినా కమలా హ్యారిస్.. ఇలాంటి డిబేట్లకు బదులుగా పరిపాలనపై దృష్టి సారించాలంటూ ట్రంప్ సూచించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడూ అడ్మినిస్ట్రేషేన్ గురించి ఆమె పట్టించుకోలేదని, ఇప్పుడు డిబేట్లల్లో పాల్గొనడం వల్ల ఏం సాధిస్తారని వ్యాఖ్యానించారు. మరో డిబేట్ ఉండబోదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications