ఈ జెండా మా చావుకొచ్చింది..సరిహద్దు దాటిన అభాగ్యుల కన్నీటి గాథ!
ఒక్క జెండా వివాదం చివరకు ప్రాణాల మీదికి తెచ్చింది. శతాబ్దాలుగా పక్కపక్కనే జీవిస్తున్న ఇరు వర్గాల మధ్య వెలిగిన చి చిన్న వివాదం.. ఇప్పుడు పెను జ్వాలలా మారి ఊళ్లకు ఊళ్లనే తగలబెడుతోంది. సరిహద్దుల్లో తుపాకుల రణగొణ ధ్వనులు, కంటికి కనిపించకుండా పేలుతున్న బాంబులు, కళ్లముందే కాలిపోతున్న ఇళ్లు.. ఇదీ ఇథియోపియా-కెన్యా సరిహద్దు పట్టణం 'మోయాలే'లో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితి. కేవలం ప్రాణాలను చేతిలో పట్టుకుని, అందిన కాడికి సర్దుకుని ఇళ్లను వదిలేసి సరిహద్దులు దాటుతున్న అభాగ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
కళ్లముందే అన్యాయంగా కాలిపోయిన జీవితాలు
మోయాలే ప్రాంతానికి చెందిన హవా హసన్ అనే మహిళ ఆవేదన ఇక్కడి భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది. "మా ఇళ్లను మా కళ్లముందే తగలబెట్టారు. అంతకంటే దారుణం ఏమిటంటే.. గోడ పక్కన సైలెంట్‌గా కూర్చున్న 13 ఏళ్ల చిన్నారిని ఏ తప్పూ చేయకపోయినా విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. జెండా వివాదానికి ఆ చిన్నారికి ఏం సంబంధం?" అంటూ ఆమె రోదించిన తీరు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. అక్కడి నుంచి ప్రాణాలు దక్కించుకుని పొరుగునే ఉన్న కెన్యాకు పారిపోతున్న దారిలోనే ఎందరో గర్భిణులు కాన్పులు కాగా, పుట్టిన పసిపాపలను పక్కబట్టలు కూడా లేక పచ్చి నేలమీదే పండించాల్సి వస్తోంది. ఆకలి కేకలు, తాగునీరు లేకపోవడం, దోమల దెబ్బకు మలేరియా, విరోచనాలు వ్యాపించి అక్కడి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

హద్దులు దాటుతున్న మానవతా సంక్షోభం
ఈ దాడులు, రక్తపాతం కారణంగా ఇథియోపియా నుంచి కెన్యాకు శరణార్థులుగా తరలివచ్చిన వారి సంఖ్య ఇప్పటికే 50 వేలు దాటిపోయిందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. మొదటి రోజుల్లో దాదాపు 36 వేల మంది రాగా, రోజు రోజుకూ ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వచ్చిన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. కెన్యాలోని స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తీసి ఈ అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నప్పటికీ, రోజురోజుకీ పెరుగుతున్న శరణార్థుల సంఖ్యతో స్థానికులకు కూడా తిండి, నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఐదుగురు ఉన్న ఇంట్లో ఇప్పుడు 30 మందికి వంట చేయాల్సి వస్తోందని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. ఆగిపోయిన వ్యాపారాలు
ఈ ఘర్షణల ప్రభావం కేవలం శరణార్థుల మీదే కాకుండా ఇరు దేశాల వాణిజ్యంపై కూడా తీవ్రంగా పడింది. ఆఫ్రికాలో కీలకమైన మొంబాసా-అద్దిస్ అబాబా ప్రధాన రహదారిపై వందలాది సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. వారానికి పైగా రవాణా స్తంభించిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా 20 శాతం పెరిగిపోయాయి. బ్యాంకులు మూతపడటంతో కరెన్సీ చెలామణి ఆగిపోయి వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలాయి.
భద్రతపై పొంచి ఉన్న పీడకల
ఈ గొడవలు కేవలం భూభాగం కోసం మాత్రమే కాకుండా, జాతుల మధ్య ఉన్న పాత పగలు, ప్రాంతీయ రాజకీయాల వల్ల ఉగ్రరూపం దాల్చాయని రక్షణ రంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో పేలుతున్న తుపాకీ గుళ్లు కెన్యా వైపు పడటంతో ఒక కెన్యా పౌరుడితో పాటు మరొకరు మృతి చెందారు. దీంతో కెన్యా ప్రభుత్వం అప్రమత్తమై సరిహద్దులెంబడి అదనపు బలగాలను రంగంలోకి దించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇథియోపియా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు కెన్యా పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలు పునరుద్ధరింపబడి, స్వగ్రామాలకు సురక్షితంగా వెళ్లే రోజు కోసం వేలాది మంది శరణార్థులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.














Click it and Unblock the Notifications
