Bunyan Ul Marsoos: ఆపరేషన్ సింధూర్ తో బెంబేలు-పాక్ కౌంటర్ ఆపరేషన్ మొదలు..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాక్, ఆక్రమిత కశ్మిర్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడులతో మొదలైన ఈ ఆపరేషన్ కాస్తా ఇప్పుడు ఆ దేశంలోని ఆయుధ రక్షణ వ్యవస్థలు, ఎయిర్ బేస్ లు, పోర్టులకు విస్తరించింది. దీంతో ఏం చేయాలో తెలియక విలవిలలాడుతున్న పాకిస్తాన్ ఇవాళ ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా కొత్త ఆపరేషన్ ను ప్రారంభించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత దాడులకు తగిన స్పందన లేకపోవడంతో స్వదేశంలో విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏదో ఒకటి చేయక తప్పని పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ప్రయోగిస్తున్న టర్కీ డ్రోన్లను భారత్ విజయవంతంగా కూల్చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ లోకి చొరబడి దాడులు చేస్తోంది. తొలుత ఉగ్రవాదులకే పరిమితమైన ఈ దాడులు పాక్ ప్రభుత్వ ఎదురుదాడులతో ఇప్పుడు ఆయుధ రక్షణ వ్యవస్థలు, ఎయిర్ బేస్ లకూ పాకాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో చేతులెత్తేయక తప్పని పరిస్ధితి ఎదురు కానుంది. దీంతో పాక్ అప్రమత్తమైంది.

ఆపరేషన్ సింధూర్ ను ఎదుర్కొనేందుకు బున్యన్ ఉల్ మర్సూస్ పేరుతో పాకిస్తాన్ ఎదురుదాడి మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే భారత్ పై దాడులతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ కొత్త ఆపరేషన్ తో సాధించేదేమందన్న చర్చ మొదలైంది. అయితే పాకిస్తాన్ తమ ఆపరేషన్ కు బున్యన్ ఉల్ మర్సూస్ అనే పేరు పెట్టడంపై చర్చ జరుగుతోంది. ఖురాన్ లోని పదమైన బున్యన్ ఉల్ మార్సూస్ అంటే సీసంతో తయారైన కట్టడం అని అర్ధం. ఆ పేరు పెట్టుకోవడం ద్వారా పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఒక దుర్భేద్యమైన గోడ లేదా నిర్మాణంగా చిత్రీకరించుకోవాలని కోరుకుంటోంది.
పాకిస్తాన్ తన సైనిక దుస్సాహసానికి మతం రంగు పులిమేందుకే ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అనే ఖురాన్ పదం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 1971 యుద్ధం తర్వాత భారతదేశం పంజాబ్ ప్రావిన్స్‌లోని లక్ష్యాన్ని, పాకిస్తాన్ భూభాగంలోకి లోతుగా తాకడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ పంజాబ్‌లోని ఉగ్రవాద శిబిరం సరిహద్దు నుండి 100 కి.మీ దూరంలో ఉంది. భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కొత్త ఆపరేషన్ ప్రపంచానికి చూపించేందుకు, స్వదేశంలో జనాన్ని సంతృప్తి పర్చేందుకు మాత్రమే చేపట్టినట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications