చేతులు చాచి అడుక్కు తింటున్నాం- చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది..పాకిస్తాన్ ప్రధాని షాకింగ్ స్టేట్ మెంట్ !!
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక సంక్షోభంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడటం పట్ల తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. అడుక్కు తినాల్సి వస్తోందని, మిత్ర దేశాల వద్ద ఆర్థిక సహాయం, రుణాల కోసం దేబిరిస్తోన్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలు దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని, తలదించుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయని అన్నారు.
ఇస్లామాబాద్‌లో ఎగుమతిదారుల సమావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. రుణభారం పాకిస్తాన్ గౌరవాన్ని దిగజారుస్తోదని, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలు అత్యవసరమని తేల్చి చెప్పారు. సైన్యాధిపతి అసిమ్ మునీర్‌తో సహా అధికారులందరికీ ఇది అవమానకరమని చెప్పారు. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తో కలిసి తాను ఆర్థిక సహాయం కోసం ప్రపంచ వ్యాప్తంగా భిక్షాటన చేస్తోన్నానని, అలా వెళ్లినప్పుడు చాలా సిగ్గుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

రుణాలు తీసుకోవడం తమ దేశ ఆత్మగౌరవానికి అతి పెద్ద భారంగా మారిందని, అవమానంతో తలదించుకుంటోన్నామని షెహబాజ్ షరీఫ్ అన్నారు. రుణాలకు ప్రతిఫలంగా ఆయా దేశాలు తమకు చేసిపెట్టమని కోరే చాలా విషయాలకు కాదు అని చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల కోసం యాచిస్తున్నామంటూ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడాన్ని, అంతర్జాతీయ సహాయంపై అధికంగా ఆధారపడుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఐఎంఎప్ నుంచి సహకారం, రుణాల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ప్రస్తుతం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమస్యల సమయంలో తోడుండే మిత్రదేశాలుగా చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌లను ప్రస్తావించారు. క్లిష్ట సమయంలో తమను ఆర్థికంగా ఆదుకుంటోన్నాయని ప్రశంసించారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తమకు నిరంతరం మద్దతునిస్తున్నాయని షరీఫ్ గుర్తుచేశారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ విదేశీ మారక నిల్వలను స్థిరీకరించడానికి, చెల్లింపుల సంక్షోభాన్ని నివారించడానికి చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌ల ఆర్థిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడి ఉంది. చైనా బిలియన్ల కొద్దీ సేఫ్ డిపాజిట్లను పునరుద్ధరించింది. 2024-25లో నాలుగు బిలియన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడా (CPEC) 60 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఇంధనం, మౌలిక సదుపాయాల పెట్టుబడులతో ఒక కీలక ఫ్రేమ్‌వర్క్ గా మారనుంది.












Click it and Unblock the Notifications