పాక్‌లో ప్రజాస్వామ్యం క్లోజ్: ఇంకో దశాబ్దం మీ బతుకులు అంతే..!
Pakistan: భారత్ దాయాది అయిన పాకిస్థాన్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎన్నికైన ప్రభుత్వం కూడా తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రణాళిక తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలిసి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపేందుకు ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంతో 2030 తర్వాత కూడా పాకిస్థాన్ ఆర్మీ చేతుల్లోనే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త ప్రణాళిక ప్రకారం.. ప్రభుత్వం, సైన్యం కలిసి దేశాన్ని నడపనున్నాయి. కానీ నిజానికి ఇది షరీఫ్ కుటుంబానికి అధికారాన్ని, అసీమ్ మునీర్‌కు అదనపు శక్తిని ఇస్తుంది.
రహస్య సమావేశంలో ఏం జరిగింది?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నిర్ణయం మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్‌కు చెందిన ముర్రీలోని ఫామ్‌హౌస్‌లో ఒక రహస్య సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మాలిక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 10 ఏళ్ల పాటు "వ్యవస్థ కొనసాగింపు" ప్రణాళికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.

షరీఫ్ కుటుంబం, సైన్యం చేతిలో అధికారం
అసీమ్ మునీర్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌లో ముగుస్తుంది. అయితే పాకిస్థాన్ ఆర్మీ చట్టం-1952లో మార్పులు చేసి ఆయన పదవీకాలాన్ని 5 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన 2030 వరకు అధికారంలో కొనసాగవచ్చు. ఈ సమావేశంలో నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్, అసీమ్ మునీర్ ముగ్గురూ కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని, ముఖ్యంగా సైనిక నియామకాల విషయంలో (ఐఎస్ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి కీలక పదవులు) రాజకీయ-సైనిక ఏకాభిప్రాయంతో నిర్ణయం జరుగుతుందని ప్లాన్ చేశారు. ఇది పాకిస్థాన్లో 'హైబ్రిడ్ గవర్నెన్స్ మోడల్'గా పరిగణించబడుతోంది.
ఇమ్రాన్ ఖాన్‌కు నో రిలీఫ్
ఈ రహస్య భేటీలో ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి రాజకీయ రాయితీలు, మినహాయింపులు ఇవ్వకూడదని నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్, అసీమ్ మునీర్ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అనేక కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2022లో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన సైన్యంపై, షరీఫ్ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ సమావేశం తర్వాత ఇమ్రాన్ ఖాన్ జైలు నుండి విడుదల కావడం దాదాపు అసాధ్యమని స్పష్టమైంది. దీనితో అసీమ్ మునీర్ స్థాయి మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications