PM Modi: ఏఐతో జాగ్రత్త.. పారిస్ సదస్సులో ప్రధాని మోడీ కీలక ప్రసంగం
PM Modi: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని గ్రాండ్ ప్యాలెస్ లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఏఐ ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థను, భద్రతను, మన సమాజాన్ని కూడా పునర్నిర్మిస్తోందని.. ఈ శతాబ్ధంలో మానవాళికి ఏఐ కోడ్ ను రాస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఏఐ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏఐ నేటి అవసరమని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతిభావంతులు మన దగ్గర ఉన్నారన్నారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏఐ భవిష్యత్తు ఇంకా చాలా ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. యంత్రాల శక్తి పెరుగుతుండడంతో కొందరు ఆందోళన చెందుతున్నారని.. కానీ ఆందోళన చెందడానికి ఏమీ లేదన్నారు.
ఏఐతో జాగ్రత్త..
ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించిన ప్రధాని మోడీ.. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ.. ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. పలు దేశాధినేతలు, టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏఐ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని.. ఏఐ మానవత్వ నియమావళిని అన్నారు. ఏఐ లక్షలాది మంది జీవితాలను మారుస్తోందన్నారు. కాలంతో పాటు ఉపాధి స్వభావం కూడా మారుతోందన్నారు. ఏఐ వల్ల కలిగే ఉపాధి సంక్షోభంపై మనం శ్రద్ధ వహించాలన్నారు. సాంకేతికత ఉద్యోగాలను తీసివేయదని చరిత్ర సాక్ష్యంగా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలు పోతాయి అనేది వదంతే..
ఏఐ మన రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజాన్ని సానుకూల రీతిలో మారుస్తోందన్నారు. ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతాయనే వదంతు ప్రచారంలో ఉందన్నారు. కొత్త రకం ఉద్యోగాల సృష్టి జరుగుతోందని.. వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరమన్నారు. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా ఇండియా ముందుకు వెళ్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలను మెరుగుపర్చడం ద్వారా కోట్లాది మంది జీవితాలను మార్చడంలో ఏఐ సహాయపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానికి ఘన స్వాగతం
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ ఏఐ యాక్షన్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టెక్నాలజీ సీఈవోలు సహా పలువురు నాయకులకు కీలక వేదికగా మారింది.












Click it and Unblock the Notifications