అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్
Benjamin Netanyahu: కొద్ది రోజులుగా వరుస దాడులతో లెబనాన్, గాజాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూపులను బెంబేలెత్తిస్తోంది. వాటిని నామరూపాల్లేకుండా మట్టుబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇప్పటికే ఈ రెండు మిలిటెంట్ గ్రూప్‌లకు చెందిన కీలక నేతలను హతమార్చింది. రెండు నెలలుగా ఇజ్రాయెల్ నిర్వహిస్తూ వస్తోన్న దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషెమ్ షఫియొద్దీన్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరుట్‌లో గల హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై సాగించిన డ్రోన్ దాడుల్లో ఆయన హతం అయ్యారు.
ఈ పరిణామాల మధ్య ఇటీవలే ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగింది హెజ్బొల్లా. ఆ దేశ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. జనావాసాలను సైతం లెక్క చేయలేదు. మెటులా, హైఫా ప్రాంతాలపై భారీగా రాకెట్లను సంధించింది. ఈ ఘటనల్లో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు కాగా మిగిలిన ముగ్గురు విదేశీయులు.

దీని తరువాత ఇజ్రాయెల్‌లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ ఉద్వాసనకు గురయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యోవ్ గాల్లంట్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది రోడ్ల మీదికి వచ్చారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. జాతీయ జెండాలు, ప్లకార్డులను ప్రదర్శించారు. గాల్లంట్‌కు మద్దతుగా ఉద్యమించారు.
రాజధాని టెల్ అవివ్ సహా పలు నగరాల్లో ఈ నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. రోడ్ల మీద ప్లకార్డులను తగులబెట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డప్పు మోగిస్తూ, విజిల్స్ వేస్తూ, పాటలు పాడుతూ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఒక్కసారిగా వందలాదిమంది రోడ్ల మీదికి రావడంతో అనేక చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications