Russia -Ukraine యుద్ధంలో కదిలించే కథలెన్నో: ఉక్రెయిన్ సైనికులకు చిన్నారులు సెల్యూట్..ఫోటో వైరల్..!!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధమే కావాలని కోరుకుంటున్నాడు. రష్యా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌పై ప్రపంచదేశాలు నిరసన తెలుపుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై శనివారం ఉదయం నుంచే క్షిపణి దాడులు చేస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ భవంతులను క్షిపణులతో కూల్చినట్లు స్థానికులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే కొన్ని ఘటనలు లేదా దృశ్యాలు చూసినప్పుడు మనసును కదిలించి వేస్తున్నాయి.

సైన్యానికి చిన్నారుల సెల్యూట్
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. బలమైన రష్యాను ఉక్రెయిన్ కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వం ఒడ్డుతోంది. అయితే రష్యా దగ్గర ఉన్న మిలటరీ సామగ్రితో పోలిస్తే ఉక్రెయిన్ చాలా దీన పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ తమ భూమి కోసం పోరాటం చేస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ధైర్యసాహసాలను ప్రదర్శిస్తోంది.
తమ నేలను అక్కడి ప్రజలను కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. యుద్ధానికి వెళుతున్న సైన్యంకు ఇద్దరు చిన్నారులు రోడ్డుపై నిల్చుని వారికి సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఓ చెల్లి తన అన్న చేతిని పట్టుకోగా అన్న సైన్యానికి సెల్యూట్ చేయడం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది
జవాన్ గెటప్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఇదిలా ఉంటే ఒక సాధారణ కమెడియన్ స్థాయి నుంచి ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడు అయ్యారు జెలెన్‌స్కీ. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా తగ్గలేదు సరికదా... ఒక్క ఇంచి భూమిని కూడా కోల్పోయేందుకు తాము సిద్ధంగా లేమంటూ సైన్యంలో ధైర్యాన్ని నింపుతున్నారు. అంతేకాదు స్వయంగా తానే మిలటరీ దుస్తులు ధరించి రంగంలోకి దిగారు.
వీలైనప్పుడు ఉక్రెయిన్ పరిస్థితిపై తాజా సమాచారం ఓ సెల్ఫీ వీడియో ద్వారా పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే రష్యాకు మాత్రం ఈయన టార్గెట్‌గా ఉన్నారు. సాధారణంగా యుద్ధం వచ్చిన సమయాల్లో ఆ దేశాధ్యక్షులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం మనం చూశాం.. కానీ ఇక్కడ జెలిన్‌స్కీ మాత్రం సైనికుడిగా మారి పోరాడేందుకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే
రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై ఎలాంటి కనికరం చూపడం లేదు. తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదంటూనే అమాయకులను బలిగొంటోంది. వరుస క్షిపణి దాడులు వచ్చి నివాస ప్రాంతాలను ఢీకొట్టడంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో ఉంచుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అలర్ట్ అయిన ఉక్రెయిన్ సైన్యం పలు ప్రాంతాలను ఖాలీ చేయించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మొత్తానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత దేశం రష్యాలోనే ప్రజలు చీదరించుకుంటున్నారు. ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని కోరుతూ మాస్కోలో నిరసనలకు దిగారు. అయితే పుతిన్‌కు ఇది తలకెక్కినట్లు లేదు. ఎవరెన్ని చేసినా.. ఏమి చేసినా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని వాదించే మొండి ఘటంలా తయారయ్యారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications