కడుపునొప్పి అని వెళ్లి.. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా సైన్యానికి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ లెవ్ స్టూప్నికోవ్ రహస్యంగా ఉక్రెయిన్ నిఘా వర్గాలతో చేతులు కలిపి సొంత దేశం ఆర్మీ స్థావరాల సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేశాడు. ఈ సమాచారం ఆధారంగా ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో దాదాపు 300 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ రష్యన్ అధికారి ఫ్రంట్‌లైన్ దాటి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు పారిపోయి పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బెటాలియన్‌లో చేరాడు.
బుడ్యోన్నీ మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుదైన స్టూప్నికోవ్.. డోన్బాస్ ప్రాంతంలోని కీలకమైన వుహ్లెడార్ ను హస్తగతం చేసుకునే బాధ్యతను కలిగి ఉన్న బెటాలియన్‌కు చీఫ్ సిగ్నల్స్ ఆఫీసర్‌గా నియమతుడయ్యాడు. కమాండర్లకు, నిఘా వ్యవస్థలకు మధ్య సమాచార వ్యవస్థను పర్యవేక్షించడం లాంటి బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే ఆ స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ డ్రోన్లు, కెమెరాల ద్వారా లభించే రష్యా దళాల కదలికలు, యుద్ధ ప్రణాళికల వివరాలను రహస్యంగా ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేశాడు. ఒకరోజు కడుపునొప్పి అనే నెపంతో సహచర సైనికులకు దూరంగా వెళ్లిన మరుసటి క్షణమే.. ఆయన పంపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ మిస్సైల్ దాడి జరిపింది. ఈ దాడిలోనే 68 మంది రష్యన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రష్యా ఉక్రెయిన్‌పై జరిపిన దండయాత్రే స్టూప్నికోవ్ను ఈ నిర్ణయం వైపు నడిపించింది. ఫిబ్రవరి 2022లో రష్యా హెలికాప్టర్లు, బాంబు దాడులతో నిర్దోషులైన పౌరులను చంపడాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. మిలిటరీ అకాడమీలో ఉన్నప్పుడే పుతిన్ చర్యలను నిశ్శబ్ధంగా వ్యతిరేకించిన ఆయన.. ఉక్రెయిన్‌కు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తల్లి టాట్యానా యాన్ట్సేన్ కూడా పుతిన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనేవారు. ఆమె ఉక్రెయిన్ నిఘా వర్గాలతో అనుసంధానమై ఉన్న డిమిట్రో కార్పెంకో అనే ప్రోగ్రామర్‌ను సంప్రదించడంతో స్టూప్నికోవ్ ఉక్రెయిన్‌కు సమాచారం అందించేందుకు మార్గం సుగమమైంది.
చివరకు జులై 2024లో అర్థరాత్రి వేళ రష్యన్ యూనిట్ నుంచి పారిపోయిన స్టూప్నికోవ్ ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాడు. ముందస్తుగా అనుకున్న 'పీనట్ షాప్' అనే పాస్వర్డ్ చెప్పి ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయాడు. అనంతరం రష్యన్ వాలంటీర్ కార్ప్స్లో చేరి ప్రస్తుతం పుతిన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తన భార్యతో సంబంధాలను కోల్పోవాల్సి వచ్చింది. రష్యాకు, తమ వైవాహిక జీవితాన్ని ద్రోహం చేశాడని ఆయన భార్య ఆరోపించింది. అయితే రాజ్యాంగాన్ని, స్వేచ్ఛను కాపాడుతానని ప్రమాణం చేశానని, పుతిన్ ఈ సూత్రాలన్నింటినీ నాశనం చేశారని, అందుకే తాను తన ప్రమాణానికి కట్టుబడి ఉక్రెయిన్‌కు సహకరించానని స్టూప్నికోవ్ స్పష్టం చేశాడు.














Click it and Unblock the Notifications
