జపాన్‌కు తొలి మహిళా ప్రధాని.. ముందున్న సవాళ్లు ఏంటి?
Japan New PM: జపాన్ రాజకీయ చరిత్రలో నేడు ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నేడు (అక్టోబర్ 21) జపాన్ పార్లమెంట్ సనే తకైచిని దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)కి చెందిన 64 ఏళ్ల సనే తకైచి కఠినమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ఆమె జపాన్‌కు 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జపాన్ 'ఐరన్ లేడీ'గా పేరొందిన తకైచిని ఆమె విమర్శకులు 'లేడీ డొనాల్డ్ ట్రంప్' అని కూడా పిలుస్తారు. 64 ఏళ్ల తకైచి, రెండుసార్లు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసిన మాజీ ప్రధాని షిగేరు ఇషిబా స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
మెజారిటీ లేకపోవడంతో సంకీర్ణం:
ఎన్నికల్లో పూర్తి మెజారిటీ లభించకపోవడంతో ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందు, తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP) తో సంకీర్ణం ఏర్పాటు చేసి విజయం సాధించింది. కొత్త ప్రధాని ఎన్నిక కోసం 465 స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. తకైచికి 237 ఓట్లు లభించాయి. ఇది సాధారణ మెజారిటీ కంటే ఎక్కువ. తకైచి నేడు సాయంత్రం దేశానికి 104వ ప్రధానమంత్రిగా, మొదటి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మాజీ పీఎం కిషిడా నుంచి 'తాలిబాన్ తకైచి' అని విమర్శ:
ప్రధానమంత్రి కావడానికి ముందు తకైచి ఎల్డీపీ(LDP)కి నాయకత్వం వహించిన మొదటి మహిళగా కూడా గుర్తింపు పొందారు. అక్టోబర్ 4న జరిగిన పార్టీ నాయకత్వ ఎన్నికల్లో 185 ఓట్ల తేడాతో గెలిచి ఆమె పార్టీ ప్రధాని అభ్యర్థిగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ఆమె చేసిన కృషి, ఆమె కఠినమైన సంప్రదాయవాద ఇమేజ్ ఈ విజయాన్ని అందించినట్లు చెబుతున్నారు. విమర్శకులు తకైచిని 'లేడీ ట్రంప్' అని పిలుస్తుండగా, మాజీ ప్రధాని కిషిడా ఆమెను 'తాలిబాన్ తకైచి' అని కూడా సంబోధించారు.
తకైచి ముందున్న ప్రధాన సవాళ్లు
రెండు సభల్లో మెజారిటీ లేకపోయినా LDP పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. తకైచి దేశ నాయకత్వాన్ని చేపట్టే క్రమంలో ఆమెకు అనేక పెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. తకైచి ముందున్న అతిపెద్ద సవాలు పార్టీలో మళ్లీ ఐక్యత తీసుకురావడం, ఇతర పార్టీల నుంచి సహకారాన్ని ) పొందడం. దీనితో పాటు దేశ ఆర్థిక, విదేశాంగ విధానం దిశపై మార్కెట్లు, ప్రజలకు విశ్వాసం కల్పించడం కూడా తకైచికి ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. మాజీ ప్రధాని షింజో అబే విధానాలను కొనసాగించడం ద్వారా ఆమె ఈ విశ్వాసాన్ని పెంచాల్సి ఉంటుంది.
శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని
జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన సనే తకైచికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్‌ల వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తకైచితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications