కటకటాల వెనక్కి కొరియా అధ్యక్షుడు
South Korea: దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. అభిశంసనకు గురైన ఆ దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ అరెస్ట్ అయ్యారు. దేశంలో మార్షల్ లాను అమలు చేయడానికి యూన్ సుక్ సాగించిన ప్రయత్నాలే ఈ పరిస్థితులకు దారి తీశాయి.
కిందటి నెల యూన్ సుక్ అభిశంసనకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఆయనకు ఉద్వాసన పలికింది. సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు. ప్రధానమంత్రి హ్యాన్ డుక్-సూ.. తాత్కాలిక అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు అప్పట్లో.

మార్షల్ లా ప్రవేశపెట్టే విషయంలో అధికార పీపుల్ పవర్ పార్టీ ఆఫ్ కొరియా నిలువునా చీలింది. మెజారిటీ సభ్యులు మార్షల్ లాకు వ్యతిరేకంగా నిలిచారు. మొత్తం 300 మంది సభ్యులు ఉండే దక్షిణ కొరియా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేశారు.
తీర్మానం ఆమోదం పొందాలంటే 200 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. 204 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం సభామోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. యూన్ సుక్ పదవీచ్యుతుడైనట్టయింది. ఆ వెంటనే ప్రధానమంత్రి హ్యాన్ డుక్-సూను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు సభ్యులు.
ఇప్పుడు తాజాగా ఆయన అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని సియోల్‌లోని అదికారిక నివాసానికి వచ్చిన యాంటీ కరప్షన్ ఏజెన్సీ, ఇతర విభాగాలకు చెందిన అధికారులు యూన్ సుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అనధికారిక కాన్వాయ్‌లో ఆయనను తమ వెంట తీసుకెళ్లారు.
యూన్ సుక్ అరెస్టయిన విషయం తెలిసిందే వెంటనే- దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. దక్షిణ కొరియన్లందరూ రోడ్ల మీదికి వచ్చి సంబరాలు చేసుకున్నారు. రాజధాని సియోల్, బుసాన్, డేగు, ఇంచియాన్, గ్వాంగ్ఝు, ఉల్సాన్ వంటి నగరాల్లో జనం భారీ సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. పలుచోట్ల విజయోత్సవాలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications