ట్రంప్ డిక్లరేషన్.. అది మాదే, మూసేస్తే ప్రపంచానికే ప్రమాదం!
అమెరికా, ఇరాన్‌ల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు రగులుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా అభివర్ణించిన ట్రంప్, ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని తయారు చేయకూడదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
సౌత్ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చలకు తమకేమీ తొందరలేదని స్పష్టం చేశారు. "హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి నేను అమెరికా సొంత భూభాగంగానే భావిస్తున్నాను. ఆ ప్రాంతంపై , అక్కడ ఉన్న దిగ్బంధనంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది" అని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే అమెరికాకు ఆమోదయోగ్యమైన షరతులకు ఆ దేశం ఇంకా సిద్ధంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన ఒక ఏఐ (AI) చిత్రాన్ని కూడా తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పంచుకున్నారు.

చమురు రవాణాకు జీవనాడి వంటి ప్రాంతం
ప్రపంచ ఇంధన సరఫరాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో దాదాపు ఐదవ వంతు ఈ సరుకుల మార్గం గుండానే వెళుతుంది. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంపై తమకు పూర్తి ఆధిక్యం ఉందని అమెరికా క్లెయిమ్ చేయడం అంతర్జాతీయ రాజకీయంలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు , సైనిక ఒత్తిడిని మరింత పెంచే వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్‌కు భ్రమలు ఎక్కువ: తిప్పికొట్టిన ఇరాన్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాదీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హోర్ముజ్ జలసంధిపై ట్రంప్‌కు ఉన్న అజ్ఞానాన్ని, భ్రమలను త్వరలోనే కాలమే సరిదిద్దుతుందని, లేదా తామే స్వయంగా ఆయన భ్రమలను తొలగిస్తామని హెచ్చరించారు. గతంలో పర్షియన్ గల్ఫ్ పేరు విషయంలో నిజాలను తెలుసుకున్నట్లే, ఈ విషయంలోనూ ట్రంప్ నిజాలు తెలుసుకోవాల్సి వస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది. దాంతో ఈ ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకుంది.














Click it and Unblock the Notifications