Costly tea: దుబాయ్‌లో ఇండియన్ కేఫ్.. ఒక్క టీ ఖరీదు 1.14 లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే..
Golden Tea: భారత్‌లో చాయ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేదవాడి దగ్గర నుంచి అపర కుబేరుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ వారి స్తోమతకు తగినట్లు వివిధ రకాల టీలను సేవిస్తుంటారు. వాటిలో వినియోగించే పదార్థాల ఆధారంగా చాయ్ రేటు ఆధారపడి ఉంటుంది. అయితే వీటిలో కొన్నింటి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో చాయ్ ధర వింటే మెంటలెక్కిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ టీ ఖరీదు ఏకంగా 5 వేల దిర్హామ్‌లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.14 లక్షలు. భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త సుచ్తా శర్మ ఈ కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. DIFC ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్‌లో ఉన్న బోహో కేఫ్ మరియు రెస్టారెంట్‌లో ఈ టీ లభిస్తుంది.

మరి చాయ్ ధర ఈ రేంజ్‌లో ఉండటానికి కారణం లేకపోలేదు. 24 క్యారెట్ల తినదగిన బంగారు ఆకులతో 'గోల్డ్ కారక్'గా పిలిచే ఈ టీని తయారు చేస్తారు. దీని ప్రారంభ విలువ మూడున్నర వేలు కాగా రాయల్ ఆతిథ్యం కావాలనుకునే వారికి కేఫ్ గోల్డ్ సావనీర్ కరక్ టీ లేదా కాఫీని 1.14 లక్షలకు విక్రయిస్తోంది. ఇందులో బంగారంతో తడిసిన క్రోసెంట్ మరియు వెండి కప్పు & సాసర్ అందించబడతాయి. టీ తాగిన అనంతరం గుర్తుగా వీటిని కస్టమర్లు ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.
ఇవే కాకుండా ఈ కేఫ్‌లో పలు ఇతర పానీయాలు సైతం లభిస్తాయి. గోల్డెన్ వాటర్ 6 వేల 897, గోల్డెన్ బర్గర్‌లు 6 వేల 897 మరియు గోల్డెన్ ఐస్‌క్రీమ్ 9 వేల 197 చొప్పున విక్రయిస్తోంది. ఇవన్నీ కూడా 24 క్యారెట్స్ తినదగిన బంగారు రేకులతో చేసినవి కావడం గమనార్హం. ఓ ఫుడ్ వ్లాగర్ తను షేర్ చేసిన వీడియోలో ఈ కేఫ్‌లో లభించే విలాసవంతమైన పానీయాల గురించి వివరించారు.
దీనిపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. టీ తాగడానికి కూడా EMIలు చెల్లించాలా అని ఒకరు చమత్కరించారు.
కాగా మరొకరు ఈ టీ తాగిన తర్వాత విమానంలో ప్రయాణించాలంటే కస్టమ్స్‌కు డిక్లరేషన్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఈ గోల్డెన్ చాయ్ టీ ప్రియులలో అమితాసక్తిని రేకెత్తించింది. అయితే వెనువెంటనే కొందరు విమర్శలు సైతం గుప్పించారు.












Click it and Unblock the Notifications