ట్రంప్ ఆపరేషన్ సక్సెస్: వెనిజులా పగ్గాలు ఆ 'ఐరన్ లేడీ' చేతికేనా?
వెనిజులా రాజకీయాల్లో శనివారం ఓ సంచలనం చోటుచేసుకుంది. దాదాపు 25 ఏళ్ల పాటు సాగిన చావిస్మో(హ్యూగో చావెజ్ సిద్ధాంతం) పాలనకు తెరదించుతూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వెనిజులా తదుపరి బాధ్యతలను ఎవరు చేపడతారనే ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో 'ఐరన్ లేడీ' గా పిలవబడే మారియా కొరినా మచాడో (Maria Corina Machado) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఎవరీ మారియా కొరినా మచాడో?
57 ఏళ్ల మారియా కొరినా మచాడో వెనిజులా ప్రతిపక్షానికి ఒక నిప్పుకణిక వంటి నాయకురాలు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం, శాంతియుత మార్గంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా 2025 నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. జైలు శిక్షలు, ప్రాణహాని ఉన్నప్పటికీ ఆమె వెనిజులా వదిలి వెళ్లకుండా అజ్ఞాతంలో ఉంటూనే నికోలస్ మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. 2024 ఎన్నికల సమయంలో జరిగిన ప్రైమరీల్లో ఆమెకు 90 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే మదురో ప్రభుత్వం ఆమెను 15 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది.

అమెరికా 'సర్జికల్ స్ట్రైక్' - మదురో అరెస్ట్
జనవరి 3, 2026 తెల్లవారుజామున అమెరికా జరిపిన భారీ దాడుల్లో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా సైన్యం పట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, వారిని దేశం నుంచి బయటకు తరలించినట్లు పేర్కొన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో-టెర్రరిజం ఆరోపణల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా వెల్లడించింది.
తదుపరి పాలకురాలు మారియానేనా?
ప్రస్తుత పరిస్థితుల్లో వెనిజులాలో అధికార మార్పిడికి మారియా కొరినా మచాడో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గత నెలలోనే ఆమె 'క్రమబద్ధమైన రాజకీయ మార్పు' కోసం ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో నిజమైన విజేతగా పరిగణించబడుతున్న ఎడ్ముండో గోంజాలెజ్, మారియా బృందం కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. గోంజాలెజ్ ఇప్పటికే ఆమెను తన వైస్ ప్రెసిడెంట్‌గా ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications