డొనాల్డ్ ట్రంప్ బిగ్ యూటర్న్- భారత్ కు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను మార్చుకున్నారు. అవన్నీ కూడా భారత్ కు ఊరట కలిగించేవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో విధించిన టారిఫ్ ను తాజాగా కుదించారు. ప్రత్యేకించి- ఆహార వస్తువుల దిగుమతులను కుదింపు పరిధిలోకి తీసుకొచ్చారు. టీ, కాఫీ, అరటిపండ్లు, పండ్ల రసాలు, సుగంధ్ర ద్రవ్యాలు వంటివి.. ఇందులో ఉన్నాయి.
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. రష్యాను బద్ధశత్రువుగా పరిగణించారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు.

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. దీనివల్ల భారత్ పై అదనపు భారం పడింది. భారత్ సహా వివిధ దేశాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత సైతం ఎదురైంది. అమెరికన్లు కూడా దీనిపై గుర్రుగా ఉంటూ వస్తోన్నారు. ఈ టారిఫ్ వల్ల ధరలు పెరగవని ట్రంప్ ఎప్పటినుంచో వాదిస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి.
ఉత్పత్తుల ధరలలో తీవ్ర పెరుగుదల కనిపించింది. అమెరికాలో బీఫ్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే విషయం. బ్రెజిల్ అమెరికాకు బీఫ్ ప్రధాన ఎగుమతిదారు. బ్రెజిల్‌పై భారీ సుంకాలు విధించడం వల్ల అమెరికాలో బీఫ్ ధరలు వేగంగా పెరిగాయి. ఈ నెలలో జరిగిన నాన్-ఇయర్ ఎన్నికల్లో ఆర్థికపరమైన ఆందోళనలు ప్రధాన అంశంగా మారాయి. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ఫలితంగా వర్జీనియా, న్యూజెర్సీలలో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు.
దీంతో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ తాజా నిర్ణయాలను తీసుకున్నారు. టారిఫ్ ను తగ్గించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అధికారికంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, బీఫ్, కాఫీ, పండ్లతో పాటు టీ, పండ్ల రసాలు, కోకో, సుగంధ ద్రవ్యాలు, అరటిపండ్లు, నారింజ, టమాటాలు, కొన్ని రకాల ఎరువులపై విధించిన టారిఫ్ ను కూడా తొలగించారు. వీటిలో కొన్ని ఉత్పత్తులు అమెరికాలో ఉత్పత్తి కావు. ఇప్పుడు ఈ వస్తువుల ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications