ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంపై ట్రంప్ గురి: యుద్ధం తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. వెనిజులాపై ఇటీవలి సైనిక చర్య తర్వాత.. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్ మీద పడింది. దీనిని అమెరికాలో చేర్చుకోవడానికి మర్యాదగా లేదా కఠినంగా.. ఏదో ఒక దారి చూస్తామని ఆయన చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
సైనిక వ్యూహాలు.. స్పెషల్ ఫోర్సెస్
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై ట్రంప్ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్‌పై పట్టు సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా సైనిక ఉన్నతాధికారులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని, నాటో మిత్రదేశమైన డెన్మార్క్‌తో సంబంధాలు తెగిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు.

డబ్బు ఎర.. పౌరులకు భారీ ఆఫర్?
డెన్మార్క్ ప్రభుత్వం గ్రీన్‌లాండ్‌ను విక్రయించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో ట్రంప్ సరికొత్త ఎత్తుగడ వేశారు. గ్రీన్‌లాండ్ పౌరులను ప్రలోభపెట్టేలా ఒక్కో వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు(సుమారు రూ.8 లక్షల నుండి రూ.89 లక్షల వరకు) నగదు చెల్లించి వారిని అమెరికాలో విలీనానికి ఒప్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గ్రీన్‌లాండ్‌లో ఉన్న సుమారు 57 వేల మంది పౌరుల మద్దతు కూడగట్టడం ద్వారా డెన్మార్క్ నుంచి దానిని వేరు చేయాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.
గ్రీన్‌లాండ్ సంచలన ప్రకటన: "మేము అమెరికన్లం కావాలనుకోవట్లేదు"
ట్రంప్ బెదిరింపులు, ఆఫర్లపై గ్రీన్‌లాండ్ పార్లమెంటు తీవ్రంగా స్పందించింది. ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ తో పాటు ఐదు రాజకీయ పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు."మాకు అమెరికాలో భాగం కావాలని లేదు. మేము అమెరికన్లం కావాలని అనుకోవట్లేదు, డానిష్ పౌరులుగా ఉండాలని అనుకోవట్లేదు.. మేము గ్రీన్‌లాండ్ వాసులుగానే ఉండాలనుకుంటున్నాం. మా దేశ భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం." అని వారు స్పష్టం చేశారు.
అసలు ట్రంప్‌కు గ్రీన్‌లాండ్ ఎందుకు కావాలి?
ట్రంప్ ఈ ద్వీపంపై కన్నేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావం పెరగకుండా అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికాకు అత్యంత కీలకం. అక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ (గతంలో థూల్ ఎయిర్ బేస్) ఉంది. గ్రీన్‌లాండ్‌లో అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో వాడే ఈ ఖనిజాలపై చైనాకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి గ్రీన్‌లాండ్ నిల్వలను సొంతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications