26/11 ముంబై పేలుళ్ల కేసు- కీలక నిందితుడు రాణా అప్పగింతపై అమెరికా గుడ్‌న్యూస్
2008లో ముంబైలో జరిగిన తీవ్రవాద దాడిలో 166 మంది బలయ్యారు. ఇందులో అమెరికన్లతో పాటు పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి కారకుల్లో ఒకడైన కీలక నిందితుడు తహావుర్ రాణాపై అమెరికా న్యాయస్ధానాల్లో విచారణ జరుగుతోంది. గతంలో ఓసారి విచారణ జరిగినా కరోనా కారణంగా జైలు నుంచి విడులయ్యాడు. ఆ తర్వాత భారత్ విజ్ఞప్తి మేరకు రాణాను అప్పగించే ప్రక్రియ వచ్చే నెల 22న ప్రారంభం కావాల్సి ఉంది.
ఏప్రిల్ 22న ప్రారంభం కావాల్సిన తన అప్పగింత ప్రక్రియను వాయిదా వేయాలని తహావుర్ రాణా చేసిన విజ్ఞప్తిపై అమెరికా న్యాయస్ధానం విచారణ జరిపింది. ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్ జైల్లో ఉన్న రాణాను భారత్‌కు అప్పగించాలా వద్దా అన్న అంశంపై ఈ విచారణ జరిగింది. ఇందులో అమెరికా ప్రభుత్వం అప్పగింత ప్రక్రియను వాయిదా వేయొద్దని స్పష్టం చేసింది. దీంతో రాణాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగింతపై తన అభిప్రాయం చెప్పేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాణా కోరగా... అమెరికా సర్కార్ దాన్ని తిరస్కరించింది.

భారత్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అమెరికా తహావుర్ రాణాను ఈ కేసులో అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు న్యాయస్ధానాల్లోనూ క్లియరెన్స్ తీసుకుంటే ఏప్రిల్ 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓసారి రాణా భారత్‌కు చేరుకుంటే అక్కడి నుంచి ఈ కేసులో కీలక ఆధారాలు లభించవచ్చని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వంపై ఇప్పటికే భారత్ ఒత్తిడి పెంచుతోంది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన డేవిడ్ హెడ్లీకి తహావుర్ రాణా స్కూల్ ఫ్రెండ్.