H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య మలుపు
హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో మరో పిటీషన్ దాఖలైంది. వీసా పెంపుపై దాఖలైన రెండో పిటీషన్ ఇది. యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీన్ని దాఖలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసింది. లక్ష డాలర్ల ఫీజు పెంపు చట్టవిరుద్ధమని పేర్కొంది. దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 19న డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు.. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి.

ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఎంటర్ అయింది. ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఫీజు పెంపు వల్ల అమెరికాలో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని, ప్రత్యేకించి- స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇది పెను భారంగా మారుతుందని తెలిపారు. ఫీజు చెల్లించి ఉద్యోగులను రప్పించుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.
ఏకపక్షంగా ఫీజును పెంచడం వల్ల ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్ ను కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉల్లంఘించిందని నీల్ బ్రాడ్లీ అన్నారు. హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపు ప్రభుత్వ పరిపాలనా ఖర్చులకు అనుగుణంగా ఉండాలే తప్ప ఆదాయ వనరుగా ఉండకూడదని స్పష్టం చేశారు. అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన గ్లోబల్ టాలెంట్‌ను పొందడానికి మాత్రమే కాంగ్రెస్ H 1B ప్రోగ్రామ్‌ను సృష్టించిందని గుర్తు చేశారు. సమతుల్యమైన వీసా విధానం అవసరమని అన్నారు.
ఇదివరకు ఉద్యోగ సంఘాలు ఇదే విషయంపై పిటీషన్ ను దాఖలు చేశాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండా పన్నులు లేదా ఆదాయాన్ని పెంచే చర్యలను నేరుగా చేపట్టే అధికారం అధ్యక్షుడికి లేదని పిటిషనర్లు వాదించారు. రెగ్యులేటరీ చట్టాలు, అందులో ఉన్న ప్రక్రియను ట్రంప్ పాటించలేదని పేర్కొన్నారు. లక్ష డాలర్ల ఫీజు పెంపు వల్ల ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలు, పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థలు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ ఫీజు కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతోంది వైట్ హౌస్. ఇప్పటికే జారీ అయిన H-1B వీసా హోల్డర్లకు వర్తించదనీ స్పష్టం చేస్తోంది. ఇది వార్షిక ఫీజు కాదని, వన్-టైమ్ ఫీగా వివరణ ఇచ్చింది. కొత్త వీసాలకు మాత్రమే ఈ ఫీజు చెల్లుబాటు అవుతుందని, రెన్యూవల్స్ లేదా ప్రస్తుత వీసా హోల్డర్లపై ఎటువంటి భారం పడబోదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరొలినా లీవిట్ పేర్కొన్నారు. దేశం వెలుపల ఉన్న వీసా హోల్డర్లకు కూడా వర్తించబోదని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications