అమెరికాకు చైనా మరో భారీ షాక్- బోయింగ్ జెట్ డెలివరీలకు బ్రేక్..!
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదిరింది. ఇప్పటికే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత విదేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ వారిపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో చైనాపైనా భారీగా సుంకాలు పెంచారు. ఏకంగా 145 శాతానికి సుంకాలు పెంచేశారు. దీంతో చైనా కూడా 125 శాతం వరకూ సుంకాలు పెంచేసి ట్రంప్ కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ అమెరికాకు చైనా మరో షాకిచ్చింది.
అమెరికా విమానయాన దిగ్గజం బోయింగ్ నుండి జెట్ విమానాల డెలివరీలను నిలిపివేయాలని చైనా తన విమానయాన సంస్థల్ని ఆదేశించింది. చైనా బోయింగ్ విమానాల డెలివరీలను నిలిపివేయాలని విమానయాన సంస్థలను ఆదేశించిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. ఆమెరికా కంపెనీల నుండి విమానాలకు సంబంధించిన పరికరాలు, విడిభాగాల కొనుగోళ్లను నిలిపివేయాలని బీజింగ్ తన క్యారియర్‌లకు కూడా చెప్పిందని పేర్కొంది.

అమెరికా దిగుమతులపై బీజింగ్ పరస్పర సుంకాలు విధించడం వల్ల విమానాలు మరియు విడిభాగాలను తీసుకురావడానికి అయ్యే ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బోయింగ్ జెట్‌లను లీజుకు తీసుకుని అధిక ఖర్చులను ఎదుర్కొంటున్న క్యారియర్‌లకు సహాయం చేసే అవకాశాన్ని చైనా ప్రభుత్వం పరిశీలిస్తోందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. గత వారం చైనా మినహా అన్ని దేశాలపై పెంచిన సుంకాల అమలును ట్రంప్ నిలిపేశారు. దీంతో చైనా ట్రంప్ పై గుర్రుగా ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్‌లు, సెమీకండక్టర్లు. కంప్యూటర్లు వంటి హై-ఎండ్ టెక్ వస్తువులపై చైనా, ఇతరులపై తాజా సుంకాల నుండి అమెరికా మినహాయింపులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications