13 కోట్ల ఓట్లు డిలీట్! ఎవరీ ప్రమీలా జయపాల్?
భారతదేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారనే వార్తలపై విదేశాల్లోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి ప్రమీలా జయపాల్ ఈ అంశంపై ఘాటుగా స్పందించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి జరుగుతున్న శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలపడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
'13 కోట్ల ఓటర్ల తొలగింపు ఆందోళనకరం'.. ప్రమీలా జయపాల్ తీవ్ర అసంతృప్తి
భారతదేశంలో కోట్లాది మంది పౌరుల ఓటు హక్కును తొలగించడం ప్రజాస్వామ్య విలువలకే ముప్పు అని ప్రమీలా జయపాల్ విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, "భారత ప్రభుత్వం ఓటర్ల జాబితా నుంచి 130 మిలియన్ల (13 కోట్లు) మందిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలు నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి" అని వ్యాఖ్యానించారు.
I am deeply concerned about the actions of the Indian government to purge 130 million people from the voting rolls. This appears to be a similar playbook to what the Trump Administration is doing here at home to undermine voting rights in a democracy.
— Rep. Pramila Jayapal (@RepJayapal) October 14, 2026
ఈ విషయంపై అధికారికంగా ధ్వజమెత్తిన మొదటి అమెరికా ప్రజాప్రతినిధిగా ఆమె నిలిచారు. అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం ఓటింగ్ హక్కులను దెబ్బతీసేందుకు అనుసరించిన వ్యూహాన్నే భారతదేశంలోనూ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె విశ్లేషించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి శాంతియుత నిరసనలు ఎంతో అవసరమని, హక్కుల కోసం పోరాడుతున్న భారత ప్రజలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఓటర్ల ఆగ్రహం.. సీఈసీ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
ఓటర్ల తొలగింపు వ్యవహారంపై భారతదేశంలో ఇప్పటికే విపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయి. పార్లమెంట్ లోపల, బయట రాహుల్ గాంధీ నాయకత్వంలో వేలాది మందితో భారీ ఆందోళనలు నిర్వహించారు. ఈ సవరణ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు గళమెత్తుతున్నారు.
విడతలవారీగా కోట్లలో కోతలు.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటోంది?
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించిన మొదటి, రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు 7.2 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించారు. ప్రస్తుతం సాగుతున్న మూడో విడతలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలో మరో 6.16 కోట్ల పేర్లను తొలగించినట్లు తేలింది. అయితే, పొరపాటున లేదా సాంకేతిక కారణాల వల్ల ఏమైనా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే, వారు క్లెయిమ్‌లు, అభ్యంతరాల ప్రక్రియ ద్వారా లేదా నేరుగా ఫారమ్-6 పూరించి మళ్లీ తమ పేరును నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది.
ఎవీ ప్రమీలా జయపాల్?
ప్రమీలా జయపాల్ 1965 సెప్టెంబర్ 21న చెన్నైలోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. భారతదేశం, ఇండోనేషియా, సింగపూర్లలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆమె, 16వ ఏట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. జార్జ్‌టౌన్ వర్సిటీ, నార్త్‌వెస్టర్న్ వర్సిటీల నుంచి విద్యనభ్యసించిన తర్వాత ప్రజా ఆరోగ్యం, వలసదారుల హక్కుల కోసం దశాబ్దాల పాటు కృషి చేశారు.
2016లో అమెరికా ప్రతినిధుల సభకు తొలిసారిగా ఎన్నికైన ఆమె, యూఎస్ ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించిన మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం వాషింగ్టన్ 7వ నియోజకవర్గం నుంచి ఐదోసారి కాంగ్రెస్ ప్రతినిధిగా సేవలు అందిస్తున్న ప్రమీలా జయపాల్, అమెరికా కాంగ్రెస్‌లోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ కాకస్‌కు కూడా నేతృత్వం వహించారు. వలసదారుల హక్కులు, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు.













Click it and Unblock the Notifications
