మరికొద్ది గంటల్లోనే గుడ్ న్యూస్.. భారత్ నుంచే అమెరికా కీలక ప్రకటన!
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేలా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో కలిసి నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే ప్రపంచానికి ఒక 'గుడ్ న్యూస్' అందే అవకాశం ఉందని ప్రకటించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ మూసివేసిన 'హోర్ముజ్ జలసంధి' అంతర్జాతీయ జలమార్గాన్ని తిరిగి తెరవడం ఈ ఒప్పందంలో ప్రధానాంశమని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ అణ్వాయుధాల ముప్పునకు శాశ్వత చెక్!
ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మార్కో రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఇరాన్ అణ్వాయుధాల గురించి భయపడాల్సిన అవసరం లేని పరిస్థితిని తీసుకురావడమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఇరాన్ వాణిజ్య నౌకలను అడ్డుకుంటూ హోర్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేయడం చట్టవిరుద్ధమని.. ఆ మార్గంలో యథావిధిగా స్వేచ్ఛా రవాణా సాగాల్సిందేనని మార్కో రూబియో స్పష్టం చేశారు.

రంగంలోకి ట్రంప్.. దాదాపు ఖరారైన ఒప్పందం
అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇతర ప్రాంతీయ మిత్రదేశాలతో జరిపిన చర్చల అనంతరం ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రకటించారు. గత 3 నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా ఈ ఒప్పందం ఉండబోతోందని, అధికారిక ప్రకటనకు ముందు తుది వివరాలపై చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసిన ఇరాన్
డొనాల్డ్ ట్రంప్, మార్కో రూబియోలు శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమేనని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలమార్గంపై నియంత్రణ తమదేనని, కేవలం యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో నౌకల రాకపోకలకు మాత్రమే తాము అంగీకరించామని.. అంతేకానీ అది పాత పద్ధతిలో ఉచిత రవాణా మార్గంగా మారబోదని ఇరాన్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఈ దశలో తమ అణు కార్యక్రమాల గురించి ఎలాంటి చర్చలు జరగలేదని, అమెరికాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ఇరాన్ స్పష్టం చేయడంతో ఈ ఒప్పందం ఎంతవరకు విజయవంతం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications