రష్యాపై అమెరికా యుద్ధ సన్నాహాలు: న్యూక్లియర్ సబ్ మెరైన్ల మోహరింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ మధ్య మాటల యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. యుద్ధ సన్నాహకాలకు తెరతీసింది. అణు బెదిరింపుల వరకూ వెళ్లిందీ వ్యవహారం. మెద్వెదేవ్ చేసిన హెచ్చరికలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.
రష్యాకు సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరింపజేయాలని ఆదేశించారు. మెద్వెదెవ్ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. అవివేక, రెచ్చగొట్టే ప్రకటనలు మాటలకు మాత్రమే పరిమితం కాదని భావించినట్లు తెలిపారు. అందుకే రెండు అణు జలాంతర్గాములను రష్యా తీరంలో మోహరించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పెట్టారు. మెద్వెదెవ్.. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. రష్యా భద్రతా మండలి సోవియట్ కాలం నాటి వ్యవస్థ. ఇప్పటి రష్యాపై అణు దాడి జరిగితే- అధ్యక్షుడి నుంచి ఎటువంటి ఆదేశాలు రానప్పటికీ.. ఆటోమేటిక్‌గా అణు ప్రతీకార దాడికి దిగేంత స్వేచ్ఛ ఈ మండలికి ఉంది.
తమ దేశాన్ని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ డెడ్ హ్యాండ్ ఎకానమీ అంటూ వ్యాఖ్యానించడాన్ని మెద్వెదెవ్ తప్పుపట్టారు. తన టెలిగ్రామ్ ఛానెల్‌లో మాట్లాడారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలను కించపరచడం మంచిది కాదని అన్నారు. ఇలా వ్యాఖ్యానించడం వల్ల అమెరికా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోందని అన్నారు.
డెడ్ హ్యాండ్ ఎకానమి అంటే ది వాకింగ్ డెడ్ సినిమాల్లాంటివి కాదని ఎద్దేవా చేశారు. అలాగే 'డెడ్ హ్యాండ్' ఎంత ప్రమాదకరమైనదో ఆ సినిమా చూసి తెలుసుకోవాలనీ దెప్పిపొడిచారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ గడువును ట్రంప్ 50 రోజుల నుండి 10-12 రోజులకు తగ్గించినప్పుడు కూడా మెద్వెదెవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా తీరంలో రెండు న్యూక్లియర్ సబ్ మెరైన్లను మోహరింపజేయాలని ఆదేశించారు. మెద్వెదెవ్.. తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడట్లేదని, అమెరికా అంటే ఏంటో రుచి చూపిస్తాననీ హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్.












Click it and Unblock the Notifications