బైడెన్ తప్పుకోవడం వెనుక.. భారీ కుట్ర
Elon Musk Interview with Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. మొన్నటికి మొన్న హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలను ముమ్మరం చేశారు. విస్తృతంగా పర్యటిస్తోన్నారు.
ఎన్నికల వేడి..
ఈ ఏడాది నవంబర్/డిసెంబర్‌లల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎదుర్కొంటోన్నారు.

ఎక్స్‌తో ఇంటర్వ్యూ..
ఎన్నికల ప్రచారంలో భాగంగా అపర కుబేరుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది- మస్క్ అధికారిక హ్యాండిల్‌లో ప్రత్యక్ష ప్రసారమౌతోంది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
అనేక అంశాలపై..
పెన్సిల్వేనియా బట్లర్ ప్రాంతంలో జరిగిన ప్రాణాంతక దాడి, 2019 ఎన్నికల్లో ఓటమి, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య తలెత్తిన సంక్షోభ పరిస్థితులు, భారత్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన, అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం, సిరియా.. వంటి అంశాలపై ట్రంప్ స్పందించారు.
వరస్ట్ ప్రెసిడెంట్..
అమెరికా చరిత్రలోనే ఓ అధ్వాన్నపు అధ్యక్షుడిగా జో బైడెన్‌పై నిప్పులు చెరిగారు ట్రంప్. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడానికి జో బైడెనే ప్రధాన కారకుడని ఆరోపించారు. బైడెన్ లేకపోయివుంటే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సంభవించి ఉండేదే కాదని తేల్చి చెప్పారు. తన హయాంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సత్సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు.
భారీ కుట్ర..
జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం వెనుక భారీ కుట్ర ఉందని డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఆయనను బలవంతంగా తప్పించారని విమర్శించారు. తనతో ఇప్పటివరకు జరిగిన పబ్లిక్ డిబేట్లల్లో బైడెన్ వెనుకంజలో ఉన్నాడని, వృద్ధాప్య కారణంతో ఆయనను పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications