భగభగమంటూ తగులబడుతున్న లాస్ ఏంజిలిస్: ఎమర్జెన్సీ డిక్లేర్: బైడెన్ ప్రయాణం రద్దు
Los Angeles wildfire: ప్రపంచంలోనే మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ సిటీగా పేరున్న లాస్ ఏంజిలిస్ మంటల బారిన పడింది. కార్చిచ్చు.. ఈ నగరాన్ని చుట్టుముట్టింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా దహించివేస్తోంది. అనేక ప్రాంతాలు బుగ్గిపాలు అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ ఏంజిలిస్ స్టేట్ గవర్నమెంట్ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలు చేపట్టింది. కార్లు, బస్సులు.. ఇలా అందుబాటులో ఉన్న వాహనాల్లో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 30,000 మందిని తరలించనున్నట్లు లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

లాస్ ఏంజిలిస్ చుట్టూ దట్టమైన అడవులు ఉన్న విషయం తెలిసిందే. ఏంజిలిస్ నేషనల్ ఫారెస్ట్, మౌంటో ఆంటోనియో, శాంటా మోనికా మౌంటెయిన్స్ నేషనల్ పార్క్, పాయింట్ ముగు స్టేట్ పార్క్, మలీబు, పాలిసేడ్స్.. వంటివన్నీ అటవీ ప్రాంతాలే. వేల హెక్టార్లల్లో విస్తరించి ఉందీ అటవీ ప్రాంతం మొత్తం కూడా.
తాజాగా పాలిసేడ్స్‌లో కార్చిచ్చు అంటుకుంది. సుమారు 2,921 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ఇది. ఒక్కసారిగా ఇక్కడ మంటలు అంటుకున్నాయి. సుమారు 800 ఎకరాలు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా అగ్నికి అహూతి అవుతోంది.
బలమైన ఈదురుగాలులు, పొడి వాతావరణం దీనికి తోడైంది. ఫలితంగా మంటలు ఊహించిన దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతోన్నాయి. పాలిసేడ్స్ అటవీ ప్రాంతానికి ఆనుకునే ఉన్న లాస్ ఏంజిలిస్‌లోని పలు జనావాసాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి.
లాస్ ఏంజిలిస్, ఆరెంజ్, వెంచురా, శాన్‌డియాగో, శాన్ బెర్నార్డినొల్లో భారీ అపార్ట్‌మెంట్లు సైతం మంటల బారిన పడ్డాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్ల సంగతి సరేసరి. అనేక వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వేలాదిమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వెస్ట్ హాలివుడ్ ప్రాంతంలో కార్చిచ్చు తీవ్రత అత్యధికంగా కనిపించింది.
ఈ కార్చిచ్చు ప్రభావం వల్ల వాతావరణం తీవ్రంగా ప్రభావితమైంది. ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగింది. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోన్నాయి. వేడి గాలుల తీవ్రత 80 నుంచి 130 కిలోమీటర్ల వరకూ పెరుగుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. మరో 24 గంటల పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Our neighbor’s friend sent this video evacuating our area… pic.twitter.com/n8zLWgi3gR
— James Woods (@RealJamesWoods) January 8, 2025
సిటీ పరిధిలో 13,000 నివాసాలు మంటల్లో చిక్కుకున్నట్లు లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ క్రిస్టిన్ క్రాలీ తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసొమ్.. అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలకు ఆదేశించారు. అదే సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ నేడు కాలిఫోర్నయా పర్యటనకు రావాల్సి ఉండగా.. అది రద్దయింది.












Click it and Unblock the Notifications