విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన కెనడా ప్రభుత్వం: భారత విద్యార్థులకూ భారమే
ఒట్టావా: కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు భారీ షాకిచ్చింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విదేశీ విద్యార్థులపై నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచుతోంది. ఈ క్రమంలో స్టూడెంట్ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
తాజా నిర్ణయం కేవలం పెరుగుతున్న జీవన వ్యయానికి సంబంధించే కాకుండా తగిన వసతిని పొందడంలోనూ అంతర్జాతీయ విద్యార్థులకు దోహదపడుతుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను 2024, ఏప్రిల్ 30వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.

కాగా, కెనడాలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన జీవన వ్యయం డిపాజిట్‌ను అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా మార్చలేదు. స్టూడెంట్ క్యాడ్ కింద నివాస, వసతి కోసం ఒక్కో దరఖాస్తుదారుడు 10వేల డాలర్లు డిపాజిట్ చేయాలి. కాలక్రమేణా జీవన వ్యయం పెరగడం వల్ల విద్యార్థులు ఇక్కడకు చేరుకున్న తర్వాత అవి సరిపోవడం లేదని కెనడా ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వీటి కోసం 20,635 డాలర్లు ఉన్నట్లు దరఖాస్తుదారుడు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. తొలి ఏడాది ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం కావడం గమనార్హం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులకు కూడా భారం కానుంది.












Click it and Unblock the Notifications