వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికుల విమానాన్ని యుద్ధ విమానం వెంటాడితే పైలట్ ఏం చేస్తాడు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాసింజర్ ఫ్లైట్లను పలు సందర్భాలలో మిలిటరీ జెట్‌లు వెంబడించే పరిస్థితులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అది 2021 సంవత్సరం, మే 23 వ తేదీ. గ్రీస్ నుంచి లిథువేనియా వెళుతున్న ర్యాన్‌ఎయిర్‌ సంస్థకు చెందిన విమానం బెలరూస్ గగనతలంలో ప్రయాణిస్తుండగా ఒక మిలిటరీ జెట్ దానిని వెంబడించి, బలవంతంగా కిందకు దించింది.

''ఒక యుద్ధ విమానం ప్రయాణికుల విమానాన్ని వెంటాడినప్పుడు అది ఇచ్చిన ఆదేశాలను పాటించక తప్పదు'' అని ఓ పైలట్ బీబీసీతో అన్నారు. బెలరూస్ ఒక విమానాన్ని బలవంతంగా దింపడం ఒక దారుణమైన నిర్లక్ష్య పూరిత చర్య అని ఆ పైలట్ అభివర్ణించారు.

విమానంలో బాంబు పెట్టారని, దాన్ని మిన్‌స్క్ ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్ చేయాలని మిలిటరీ జెట్ పైలట్‌ పాసింజర్ విమానాన్ని హెచ్చరించారు. దీంతో పాసింజర్ ఫ్లైట్‌ను నడుపుతున్న పైలట్ దానిని కిందికి దింపారు.

కాసేపటికి బెలరూస్ పోలీసులు విమానంలోకి ప్రవేశించి రోమన్ ప్రొటాసెవిచ్ అనే జర్నలిస్టును అరెస్టు చేసి తీసుకెళ్లారు.

దేశాల మధ్య దౌత్యానికి సంబంధించినంత వరకు ఇదొక సీరియస్ విషయమని, గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని పలువురు వ్యాఖ్యానించారు.

ఒక విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు, ఆ గగనతలం ఏ దేశానిదైనా, విమానం మాత్రం దాని యాజమాన్య సంస్థ ఏ దేశానిదో ఆ దేశపు ఆస్తిగానే పరిగణిస్తారని దౌత్య నిపుణులు చెప్పారు.

ర్యాన్‌ ఎయిర్ విమానం పోలాండ్ దేశానికి చెందినది కాగా, దాని యజమాన్య సంస్థ 'ర్యాన్ఎయిర్ సన్' ఐరిష్ ఎయిర్‌లైన్‌లో ఒక భాగం

''ఎగురుతున్న విమానం విషయంలో ఎలాంటి వివాదం వచ్చినా, ఆ విమానం ఏ దేశంలో రిజిస్టర్ అయ్యిందో ఆ దేశంతో సమస్యగానే పరిగణించాలి'' అని ఏవియేషన్ రంగానికి చెందిన ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు. ''ఇది అంతర్జాతీయ నియమాల ఉల్లంఘనే'' అని మరో పైలట్ అన్నారు.

ఒక దేశపు గగన తలంలో ప్రయాణిస్తూ, ఆ దేశంలో దిగాల్సిన అవసరం లేకుండానే విమానాలు రాకపోకలు సాగించడం గగనతల ప్రయాణ స్వేచ్ఛకు నిదర్శనం. దీనినే 'ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఎయిర్' అని అంటారు.

ఇది ప్రయాణికులు ఒక దేశం నుంచి మరో దేశానికి అవాంతరాలు లేకుండా వెళ్లడానికి అవకాశం కల్పిస్తుంది.

మరో దేశానికి చెందిన ఒక పాసింజర్ విమానాన్ని బెలరూస్ అడ్డగించి దించేయడం అంతర్జాతీయ గగనతల నియమాలను ఉల్లంఘించడమేనని అప్పట్లో నిపుణులు అన్నారు. దీన్ని 'ప్రభుత్వ ప్రాయోజిత హైజాక్' అని 'ర్యాన్‌ఎయిర్' అధినేత మైఖేల్ ఓ లియరీ వ్యాఖ్యానించారు.

అయితే, బెలరూస్ అంతర్జాతీయ వాయు ప్రయాణ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన వారికి మాత్రమే 'ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఎయిర్' నిబంధనలు వర్తిస్తాయి.

మిలిటరీ విమానం ఎప్పుడు వెంబడిస్తుంది?

సాధారణంగా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు హెచ్చరించడం కోసమే మిలిటరీ విమానాలు పాసింజర్ విమానాలను వెంబడించే అవకాశం ఉందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిగ్నల్స్‌ ఫెయిలై, విమానంతో సమాచారం తాత్కాలికంగా తెగిపోయినప్పుడు వెంటనే దానితో సంబంధాలు కలపడానికి నిపుణులు ప్రయత్నిస్తారు. అది విఫలమైనప్పుడు మిలటరీ విమానాన్ని పంపే అవకాశం ఉంటుంది.

''విమానం, ఏటీసీ ల మధ్య సంబంధాలు తెగిపోయినప్పుడు ఫైటర్ జెట్‌లు ఆ విమానాన్ని వెంబడిస్తాయి. పైలెట్‌కు సంకేతాలు పంపి, మిమ్మల్నెవరూ హైజాక్ చేయలేదని, విమానం కూలే ప్రమాదం లేదని హెచ్చరిస్తాడు. 9/11 ఘటన తర్వాత రేడియో సిగ్నల్స్ ఆగిపోయినప్పుడు ఏటీసీ కేంద్రాలు బాగా ఆందోళనకు గురవుతున్నాయి'' అని ఓ పైలట్ చెప్పారు.

ఇక మరో సందర్భంలో విమానం ఇబ్బందుల్లో ఉందని పైలట్ సంకేతాలు పంపినప్పుడు కూడా దానికి సహకారం అందించడంలో భాగంగా ఫైటర్ జెట్‌లను పంపే అవకాశం ఉంటుంది.

యాంత్రికమైన సమస్యలు వచ్చినప్పుడు, కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ మరో ఏటీసీ పరిధిలోకి వెళ్లినప్పుడు హెచ్చరించడానికి ఇలా ఫైటర్ విమానాలను పంపిస్తారు.

విమానం ఆగగానే పోలీసులు వచ్చి జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిచ్ అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు.

మిలిటరీ ఎస్కార్ట్ పంపినప్పుడు ఏం జరుగుతుంది?

ఆకాశంలో ఒక విమానాన్ని ఎస్కార్ట్ చేయడానికి మిలిటరీ జెట్లను పంపినప్పుడు, అవి పాసింజర్ విమానాల ముందుకు వెళతాయి. ఎయిర్‌ క్రాఫ్ట్‌కు పైలట్ ఎడమ చేతివైపు కూర్చుంటాడు. అందువల్ల ఫైటర్ జెట్ విమానానికి ఎడమవైపు వెళ్లి పైలట్‌కు కనిపించేలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ రెండు జెట్లను పంపినట్లయితే, రెండో జెట్ విమానానికి కుడివైపున గానీ, వెనకవైపున గానీ ప్రయాణిస్తుంది.

ఈ సమయంలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో జెట్ పైలెట్లు పాసింజర్ విమానం పైలెట్‌తో మాట్లాడతారు. ఒకవేళ రేడియో సిగ్నల్ పని చేయకపోతే జెట్ పైలట్ వద్ద ఇంటర్‌‌సెప్టార్ సిగ్నల్ బుక్‌లెట్ ఉంటుంది. అందులో ఉన్న సిగ్నల్స్‌ను పైలట్లు పాసింజర్ విమానం పైలట్‌కు పంపుతారు.

''రాత్రి పూటయితే టార్చ్‌లైట్ సిగ్నల్ చూపిస్తారు. పగలైతే పక్షి రెక్కలు ఊపినట్లు చేతులను ఊపి సంకేతాలు పంపిస్తారు. తనను ఫాలో కావాలని సూచించడం ఆ సిగ్నల్‌కు అర్ధం.'' అని ఒక పైలెట్ వివరించారు.

''ఒక యుద్ధ విమానం వెంబడించి, తన ఆదేశాలను పాటించాలని పాసింజర్ విమానానికి సూచించినప్పుడు, వాటిని పాటించడం మినహా మరో మార్గం లేదు. ఇది ఎలాంటిదంటే, రోడ్డు మీద ఓ పోలీస్ ఆఫీసర్ మనకు ఆదేశాలు జారీ చేయడం లాంటిదే'' అని ఓ పైలెట్ అభిప్రాయపడ్డారు.

విమానాన్ని బలవంతంగా కిందికి దింపడం ప్రభుత్వ ప్రాయోజిత హైజాక్ అని ర్యాన్ ఎయిర్ అధినేత అభిప్రాయపడ్డారు.

ప్రయాణికులు, పైలెట్ల ఆందోళన సంగతేంటి ?

ఒక విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు అనేక నిబంధనల నడుమ ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. కానీ, మధ్యలో మరో యుద్ధ విమానం వెంటాడి, దానిని దారి మళ్లించిందంటే, ఈ ప్లాన్ అంతా మారిపోతుంది.

'' ఇలాంటి పరిస్థితుల్లో పైలట్లు కంగారు పడిపోతారు. ఏం జరుగుతుందో వారికి అర్ధం కాదు. ఎక్కడికి వెళుతున్నాం, ఏ ఎయిర్‌పోర్టులో దిగాలి, అక్కడ వాతావరణం ఏంటి ? ఇలాంటివన్నీ తెలుసుకునే వీలుండదు.'' అని యూకే ఎయిర్ ‌లైన్‌కు చెందిన ఓ పైలట్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఘటనలు హఠాత్తుగా జరిగి, విమానం దారి మళ్లించాల్సి వచ్చినప్పుడు, వారు తీసుకెళ్లే మార్గంలో ఇబ్బందులు ఉండవచ్చు. అలాంటప్పుడు అందరూ ప్రమాదంలో పడొచ్చు.

''ఏమీ అర్ధం కాదు. విమానం భద్రతా ప్రణాళికలు ఏవీ కంట్రోల్‌ లో ఉండవు.'' అని విమానయాన రంగంలో పని చేసే ఒక సీనియర్ నిపుణుడు అన్నారు.

''అంతకు ముందు అనుకున్న ప్రణాళికలేవీ లేకుండా, సొంత నిర్ణయాలతో విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.

( ఈ ఘటనకు సంబంధించి మాట్లాడిన ఏవియేషన్ నిపుణులు భద్రత, దౌత్య కారణాల రీత్యా తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What would a pilot do if a fighter jet chased a passenger plane?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X