వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ‌లూచిస్తాన్: పాకిస్తాన్‌లోని ఈ ప్రాంతం చైనాకు ఎందుకు అంత కీల‌కంగా మారింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బలూచిస్తాన్

ఆసియాలోని బంగారం, రాగి, స‌హ‌జ వాయువు లాంటి వ‌న‌రులు పుష్క‌లంగా ఉండే ప్రాంతాల్లో బ‌లూచిస్తాన్ ఒక‌టి. చైనా ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుల్లో ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక స్థాన‌ముంది.

ఎన్నో ప్ర‌త్యేక‌తల‌కు నిల‌య‌మైన‌ప్ప‌టికీ ఈ ప్రాంతం మారుమూల‌న ఉండ‌టంతో పాక్ ప్ర‌జ‌లే దీని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. పేద‌రికంతో స‌త‌మ‌త‌మ‌య్యే బ‌లూచిస్తాన్‌.. పాక్‌లో అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ఒక‌టి.

రెండు ద‌శాబ్దాల క్రితం బ‌లూచ్‌లోని ఎడారి ప్రాంతంలో పాకిస్తాన్ అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. వీటితో ఏడో అణు శ‌క్తిగా ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న పాక్ చేరింది.

మే 1998లో అప్ప‌టి న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వం ‌చగాయీ జిల్లాలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ ప‌రీక్ష‌ల‌కు చ‌గాయీ-1గా నామ‌క‌ర‌ణం చేసింది.

పాక్ కంటే ముందు భార‌త్ కూడా పోఖ్రాన్‌లో అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. రెండు దేశాల‌పై అంత‌ర్జాతీయ సంస్థ‌లు ధ్వ‌జ‌మెత్తాయి. కొన్ని దేశాలు ఆంక్ష‌లు కూడా విధించాయి.

బలూచిస్తాన్

బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ

22 ఏళ్ల‌నాటి ఈ ఘ‌ట‌న బ‌లూచిస్తాన్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోతుంది. భౌగోళికంగా ఈ ప్రాంతానికి అఫ్గానిస్తాన్‌, ఇరాన్‌ల‌తో సంబంధాలున్నాయి.

పాక్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బ‌లూచ్ జాతీయ‌వాదులు ఎప్ప‌టినుంచో తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడే వ‌స్తుంటాయి.

ఈ పోరాటంలో రెండు వ‌ర్గాల వారూ మర‌ణించారు.

బ‌‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ(బీఎల్ఏ)తోపాటు పాకిస్తాన్ తాలిబాన్‌, ల‌ష్క‌రే ఝంగ్వీ.. కొన్ని అతివాద సున్నీ ముస్లిం సంస్థ‌లు ఈ ప్రాంతంలో క్రియాశీలంగా ప‌నిచేస్తుంటాయి.

కొన్ని రోజుల క్రితం క‌రాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌పై దాడిచేసింది తామేన‌ని బీఎల్ఏ ప్ర‌క‌టించుకుంది. ఈ దాడిలో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది, ఓ పోలీసు అధికారి మ‌ర‌ణించారు. నలుగురు సాయుధుల్ని భ‌ద్ర‌తా సిబ్బంది హ‌త‌మార్చారు.

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు

చైనాకు ఎందుకు ముఖ్యం?

పాక్‌లోని తీర న‌గ‌ర‌మైన‌ గ్వాద‌‌ర్‌లో జావెర్ పెర్ల్ కాంటినెంట‌ల్ హోట‌ల్‌పై దాడిచేసింది కూడా బీఎల్ఏ అని వార్త‌లు వ‌చ్చాయి.

ద‌క్షిణ బ‌‌లూచిస్తాన్‌లో ఉండే ఈ హోట‌ల్‌లో చైనాతోపాటు ఇత‌ర దేశాల మ‌దుప‌రులు ఎక్కువ‌గా విడిది చేస్తుంటారు. ఈ హోట‌ల్‌పై ఊహించ‌ని రీతిలో ఒక్క‌సారిగా దాడి జ‌రిగింది.

బిలియ‌న్ డాల‌ర్ల విలువైన చైనా ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుల‌కు ఈ హోట‌లే ఆప‌రేష‌న్ సెంట‌ర్‌గా అతివాద సంస్థ‌లు భావించేవి.

ఈ ప్రాంతంలో చైనా పెట్టుబ‌డుల‌ను బ‌లూచ్ అతివాద సంస్థ‌లు వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల‌తో స్థానికుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ద‌క్క‌డంలేద‌నేది వారి వాద‌న‌.

ఈ ప‌రిణామాల న‌డుమ‌.. అస‌లు ఈ ప్రాంతంలో ఏముంది? ఇది చైనాకు ఎందుకంత వ్యూహాత్మ‌కంగా మారింది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్, షీ జిన్‌పింగ్

చైనా-పాకిస్తాన్ ఆర్థిక న‌డ‌వా

గ‌త ఏడాది దాడి జ‌రిగిన హోట‌ల్ పైనుంచి చూస్తే గ్వాద‌ర్ పోర్టు మొత్తం క‌నిపిస్తుంది.

చైనా-పాకిస్తాన్ ఆర్థిక న‌డ‌వా (సీపెక్‌)లో భాగంగా ఆరేబియా స‌ముద్రంలో చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది.

ఈ మెగా ప్రాజెక్టుపై ఏప్రిల్ 2015లో చైనా ప్ర‌క‌ట‌న చేసింది. 62 బిలియ‌న్ డాల‌ర్ల‌ను తాము పెట్టుబ‌డిగా పెట్ట‌బోతున్న‌ట్లు దానిలో పేర్కొంది.

ఈ మొత్తం మ‌ధ్య అమెరికా దేశం నిక‌రాగ్వా జీడీపీ కంటే ఎక్కువ‌.

సీపెక్‌లో భాగంగా చైనా, పాక్‌ల‌లోని వేర్వేరు ప్రాంతాల‌ను అనుసంధానిస్తూ రోడ్లు, రైలు మార్గాలు, గ్యాస్ పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.

బ‌లూచిస్తాన్‌లోని గ్వాద‌ర్ నుంచి చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతాల‌ను అనుసంధానిస్తూ దాదాపు మూడు వేల కి.మీ. మేర ఈ కారిడార్ వ‌స్తోంది.

ఈ కారిడార్‌తో చైనాకు హిందూ మ‌హాస‌ముద్రం నేరుగా అందుబాటులోకి వ‌స్తుంది.

బలూచిస్తాన్

చైనా రాజ‌కీయాల్లో భాగం

ఈ ప్రాంతం ప్రాధాన్యాన్ని చైనా ఎప్పుడో గుర్తించింది. ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ కాలం నుంచీ దీనిపై చైనా దృష్టి ఉంది.

"చైనా ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల‌పై ఎప్పుడూ వ్యూహాత్మ‌క నిఘా ఉంటుంది. ఇరాన్‌, ఐరోపాతోపాటు మ‌ధ్య ఆసియాలోని దేశాల‌ను చేరుకునేందుకు ఈ ప్రాంతం చాలా కీల‌కం. ఈ ప్రాంతాల గుండా వాణిజ్య సంబంధాల‌కు చైనా ఎప్ప‌టినుంచో ప్రాధాన్యం ఇస్తోంది. వ్యూహాత్మ‌క కోణంలోనూ చైనాకు ఇది ముఖ్య‌మైన ప్రాంతం" అని బీబీసీ ఉర్దూ ప్ర‌తినిధి స‌క్లీన్ ఇమామ్ వ్యాఖ్యానించారు.

"ద‌క్షిణ‌ చైనా స‌ముద్రంలో అమెరికా ఎప్ప‌టినుంచో త‌మ నౌక‌ల‌ను మోహ‌రించింది. చైనాకు కీల‌క‌మైన వాణిజ్య మార్గం మ‌ల‌క్కా జ‌ల‌సంధిలో ఈ నౌక‌లు ఉన్నాయి. ఇవి చైనా ప్ర‌యోజ‌నాల‌కు అడ్డుగా మారే అవ‌కాశ‌ముంద‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి."

తూర్పువైపు జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాలు.. చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్నాయి. ప‌శ్చిమాన త‌మ మిత్ర‌దేశం పాకిస్తాన్ ఉంది.

ఒక‌వేళ చైనా వేరే మార్గంలో త‌మ స‌ర‌కుల‌ను త‌ర‌లించాల‌నుకుంటే.. బ‌‌లూచిస్తాన్ అత్యుత్త‌మ‌మైన మార్గం అవుతుంది.

బలూచిస్తాన్

పాక్ కూడా ప్రాధాన్య‌మిస్తోంది

ఈ ప్రాజెక్టుపై చైనాతోపాటు పాక్ కూడా చాలా ఆస‌క్తి చూపిస్తోంది.

"పాక్‌లో స‌రైన రైల్వే స‌దుపాయాలు, మంచి ఆసుప‌త్రులు, ఆరోగ్య కేంద్రాలు లేవు. గ‌త 40 ఏళ్ల‌లో మౌలిక స‌దుపాయాలపై పెట్టిన పెట్టుబ‌డులు చాలా త‌క్కువ‌. ఇక్క‌డ ఉన్న ఏకైక పోర్టు క‌రాచీ పోర్టు. దాన్ని కూడా వందేళ్ల క్రితం.. బ్రిటిష్ పాల‌నా కాలంలో నిర్మించారు" అని ఇమామ్ వ్యాఖ్యానించారు.

సీపెక్ ప్రాజెక్టుల‌ను సొంతంగా చేప‌ట్టే వ‌న‌రులు పాక్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర లేవు.

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) స‌మాచారం ప్ర‌కారం.. పాక్ అప్పులు జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. దేశ త‌ల‌స‌రి వార్షిక ఆదాయం 1,500 డాల‌ర్లు మాత్ర‌మే.

అయితే, ఈ ప్రాజెక్టుల‌పై పాకిస్తాన్‌లో ఆందోళ‌న కూడా ఎక్కువ‌వుతోంది. కొన్ని వ‌ర్గాలు చైనా పెట్టుబ‌డుల‌ను వ్య‌తిరేకిస్తున్నాయి.

కొంద‌రు సైద్ధాంతిక అంశాల‌పై విభేదిస్తుంటే... మ‌రికొంద‌రు త‌మ‌ను ఈ ప్రాజెక్టుల్లో భాగ‌స్వామ్యం చేయ‌డం లేద‌ని వ్య‌తిరేకిస్తున్నారు.

కరాచీ

"మా భూమిని చైనాకు అమ్మేస్తున్నారు"

"బ‌లూచిస్తాన్‌లో భిన్న ర‌కాల జాతీయవాదాలున్నాయి. కొంద‌రు పాక్ ప్ర‌తి చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తారు. ఎందుకంటే వారికి ప్ర‌త్యేక దేశం కావాలి. కొంద‌రు ఇస్లామాబాద్‌లోని ప్ర‌భుత్వంపై పంజాబ్ ప్రావిన్స్ ప్ర‌భావం ఎక్కువ ఉంద‌ని భావిస్తారు" అని ఇమామ్ వ్యాఖ్యానించారు.

"పాక్‌లో జ‌నాభా ప‌రంగా చూస్తే పంజాబ్ అతిపెద్ద ప్రావిన్స్‌. విస్తీర్ణం ప‌రంగా చూస్తే మాత్రం బ‌లూచిస్తాన్ పెద్ద‌ది. సీపెక్ ప్రాజెక్టులతో త‌మకేమీ ప్ర‌యోజ‌నంలేద‌ని బ‌లూచ్ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. త‌మ నోరు నొక్కేస్తున్నార‌ని వారు వాదిస్తున్నారు."

బ‌లూచ్ ప్ర‌జ‌లు.. పాకిస్తాన్‌తోపాటు ఇరాన్‌, అఫ్గానిస్తాన్‌, బ‌హ్రెయిన్‌, భార‌త్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోనూ ఉంటారు.

బ‌లూచ్ హ‌క్కుల‌కు స్వ‌చ్ఛంద సంస్థ అయిన బ‌లూచ్ హ్యూమ‌న్ రైట్స్ కౌన్సిల్ (బీహెచ్ఆర్‌‌సీ) వైస్ ప్రెసిడెంట్ హ‌స్సాస్ కోసా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. సీపెక్‌ను ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు. బ‌లూచిస్తాన్‌కు చెందిన ఈయ‌న లండ‌న్‌లో ప్ర‌స్తుతం ఉంటున్నారు.

"పాక్‌స్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు వారికి డ‌బ్బులు చాలా అవ‌స‌రం. అందుకే వారు మా ప్రాంతాన్ని చైనాకి అమ్మేస్తున్నారు" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల ఆరోప‌ణ‌లు

"చైనా, పాక్‌ల మ‌ధ్య ఈ భాగ‌స్వామ్యంతో బ‌లూచ్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌దు. ఈ విష‌యం మాకు ముందే తెలుసు. ఎందుకంటే బ‌లూచ్‌లోని స‌హ‌జ వాయు నిల్వ‌ల‌ను పాక్ విప‌రీతంగా తోడేసింది. ఈ గ్యాస్ అన్నిచోట్ల‌కూ వెళ్లింది. ఇక్క‌డి ప్ర‌జ‌లకు త‌ప్పా.." అని కోసా వ్యాఖ్యానించారు.

పాక్‌లోని గ్యాస్ ఉత్ప‌త్తుల్లో స‌గానికిపైగా ఈ ప్రావిన్స్ నుంచే వెలికితీస్తారు.

క‌రాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌పై దాడిచేసిన బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. ఇక్క‌డున్న ఆరు వేర్పాటువాద సంస్థ‌ల్లో ఒక‌టి. ఈ సంస్థ‌లు పాక్‌లోని వివిధ ప్రాంతాల‌పై దాడులు చేశాయి.

ఈ సంస్థ‌ల‌ను ఉగ్ర‌వాద సంస్థ‌లుగా అమెరికా, బ్రిట‌న్ గుర్తించాయి.

ఈ ప్రాంతం నుంచి ప‌నిచేసేందుకు జ‌ర్న‌లిస్టులు, మాన‌వ హ‌క్కుల సంస్థ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతుంటాయి. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ పాక్ సైన్యం భారీ స్థాయిలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను చాలాసార్లు పాక్ ప్ర‌భుత్వం ఖండించింది.

పాక్ ప్ర‌భుత్వం, వేర్పాటువాదుల మ‌ధ్య ఒప్పందం కుదిరేవ‌ర‌కూ ఈ ప్రాంతం హింసాత్మ‌కంగానే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Baluchistan that is a part of Pakistan became a hot bed for China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X