ప్రియురాలికి భర్తను 'లీజు'కు ఇస్తానన్న భార్య.. కానీ చివరకు!
థాయ్‌లాండ్‌లో ఓ వింత వివాహ వివాదం వెలుగులోకి వచ్చింది. ఖున్ క్వాంగ్ (31) అనే మహిళ జీవితంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె తన 35 ఏళ్ల భర్తతో కలిసి గత పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తోంది. వీరికి ఎనిమిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, 2025 మధ్యకాలం నుండి ఆమె భర్త ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి రావడం, తాను ఫోన్ చేస్తే పట్టించుకోకపోవడం వంటివి గమనించిన క్వాంగ్‌కు తన భర్తపై అనుమానం కలిగింది. ఆ అనుమానం నిజమేనని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు, అతను ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడని ఆమె గుర్తించింది.
భర్తకు వివాహేతర సంబంధం ఉందని తెలిస్తే మహిళలు సాధారణంగా గొడవపడడమో లేక విడాకులు తీసుకోవడం వంటివి చేస్తూ ఉండడం సహజమే. కానీ భర్తకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన ఖున్ క్వాంగ్.. విడాకులు తీసుకోవడానికి బదులుగా తన భర్తను ప్రియురాలికి "అద్దెకు" ఇస్తానని ప్రతిపాదించి అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనికి నెలకు 30,000 బాత్ (సుమారు రూ. 85,000) అద్దె చెల్లించాలని ఆమె కండిషన్ పెట్టింది. ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా, ఆర్థికంగా ఇబ్బంది లేని ప్రియురాలు ఈ అద్దె చెల్లించడానికి కూడా సిద్ధపడింది.

భర్త వైఖరి, చట్టపరమైన చిక్కులు
భార్య, ప్రియురాలు ఇద్దరూ ఈ 'లీజ్' ఒప్పందానికి సుముఖంగా ఉన్నప్పటికీ.. అసలు వ్యక్తి అయిన భర్త మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ మొత్తం వ్యవహారం థాయ్‌లాండ్‌లోని ఒక ప్రముఖ టీవీ షో 'హోన్-క్రాసే' ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై న్యాయ నిపుణులు స్పందిస్తూ.. థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం ఇలాంటి ఒప్పందాలకు ఎటువంటి చెల్లుబాటు లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని అద్దెకు ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది దేశంలోని ఏకపత్నీ వ్రత చట్టాలకు పూర్తిగా విరుద్ధమని, ఇది సమాజ నియమాలను ఉల్లంఘించడమేనని వారు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం ఖున్ క్వాంగ్ తన భర్తతో కాకుండా, తన హక్కుల కోసం సదరు మహిళపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. విడాకులు తీసుకోవడం కంటే, ఇలాంటి వింత మార్గాల ద్వారా తన భర్తను ప్రియురాలికి అద్దెకు ఇవ్వాలని ఆమె అనుకోవడం, ఆపై న్యాయ పోరాటం మొదలుపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. మనుషుల మధ్య సంబంధాలు ఇలాంటి వింత మలుపులు తీసుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications