కొత్త కేప్టెన్‌ను వెదుక్కుంటోన్న కోల్‌కత నైట్ రైడర్స్- రేసులో ఆ ఇద్దరూ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నమెంట్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు కొత్త కేప్టెన్ రాబోతోన్నాడు.ఈ రేసులో ఇద్దరు టాప్ బౌలర్లు ఉన్నారు. ప్రస్తుత కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని కేకేఆర్ ఫ్రాంఛైజీ నిర్ణయించుకుంది. త్వరలోనే కొత్త సారథి పేరును ప్రకటించనుంది. ఫ్రాంఛైజీ ఓనర్ షారుఖ్ ఖాన్.. ఆ పేరును ప్రకటించనున్నారు.
ఇంకొద్ది రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా- గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా, సీఎస్‌కేకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఏ జట్టు బోణీ కొడుతుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
ఏప్రిల్ 1వ తేదీన కోల్‌కత్ నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టనుంది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్ శిఖర్ ధావన్ కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు సారథి ఎవరనేది ఇంకా తేలట్లేదు. రెగ్యులర్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడు. ఈ సీజన్‌కు అతను దాదాపుగా దూరం కానున్నాడు.

ఈ నేపథ్యంలో కొత్త కేప్టెన్ కోసం అన్వేషణ సాగిస్తోంది. ఇద్దరు టాప్ బౌలర్ల పేర్లను ఎంపిక చేసింది. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్, టాప్ స్పిన్నర్ సునీల్ నరైన్- ఈ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి కేప్టెన్సీ కిరిటీ దక్కుతుందనేది త్వరలో తేలిపోనుంది. కేప్టెన్సీ పేరును గ్రాండ్‌గా ప్రకటించాలని నిర్ణయించింది కేకేఆర్ ఫ్రాంఛైజీ. ఓనర్ షారుఖ్ ఖాన్ స్వయంగా కొత్త కేప్టెన్ పేరును ప్రకటించనున్నారు. మంగళవారం కేప్టెన్ పేరును ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.
2012లో సునీల్ నరైన్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి కోల్‌కత నైట్ రైడర్స్ జట్టు తరఫునే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 148 మ్యాచ్‌లను ఆడాడు. 152 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 5/19. తొలి సీజన్ లోనే అతను ఈ రికార్డును సాధించాడు. అప్పటి నుంచీ నిలకడగా రాణిస్తోన్నాడు. ప్రతి సీజన్ లోనూ వికెట్లు పడగొడుతూనే వస్తోన్నాడు సునీల్ నరైన్. శార్దుల్ ఠాకూర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 75 మ్యాచ్‌లను ఆడాడు. 82 వికెట్లు పడగొట్టాడు. 4/36 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. గత సీజన్‌లోనే దీన్ని సాధించాడు.












Click it and Unblock the Notifications