మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10, 11, 14 తేదీల్లో జూబ్లీహిల్స్ పరిధిలో పోలింగ్ బూత్ లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అన్ని కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. పోలింగ్ బూత్ లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటయ్యే వాటికి మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది.
పోలింగ్ ముందు రోజు 10వ తేదీని కూడా కలుపుకొని, ఓటింగ్ జరిగే 11 తేదీల్లో సెలవు ఇచ్చింది. అలాగే కౌంటింగ్ రోజు 14వ తేదీని కూడా సెలవు రోజుగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులు. వీటితో పాటు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ప్రత్యేక సాధారణ సెలవు (Special Casual Leave) మంజూరు చేశారు.
ఈ సెలవు ప్రధానంగా పాఠశాలలకు వర్తిస్తుందని దాసరి హరిచందన చెప్పారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అలాగే, పాఠశాల లేదా కార్యాలయ భవనాలను పోలింగ్ కోసం ఉపయోగించబోతోండటం వల్ల ఆ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బార్లను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.












Click it and Unblock the Notifications