సంక్రాంతికి 6432 టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు! మహిళలకు ఫ్రీనే, కానీ
సంక్రాంతి పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) భారీ సంఖ్యలో బస్సు సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ పండగకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. జనవరి 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతోంది.
ఆ తర్వాత సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి వచ్చేందుకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక, హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తోంది. అయితే, సంక్రాంతి పండగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.50 వరకు టికెట్ ధరలను టీజీఎస్ర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు తిరిగి స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో సాధారణ బస్సు ఛార్జీల కంటే కొంత ఎక్కువ వసూలు చేయనున్నారు.
జనవరి 10, 11, 12 తేదీలతోపాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లోనూ సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయి. ఇక, రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పెల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది.
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని కోరింది.












Click it and Unblock the Notifications