డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వరా: అల్లు అర్జున్ ఆగ్రహం
సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు భారత న్యాయ సంహిత కింద సెక్షన్లు 105, 118(1) రెడ్ విత్ 3(1) ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు బన్నీ ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి మృతిచెందడానికి కారణమైనందుకు బన్నీని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతరం అతన్ని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు తరలించారు.
వాగ్వాదం జరిగింది
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులకు, బన్నీ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బన్నీ దగ్గరకు చిక్కడపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పడంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఆ సమయంలో అల్లు అర్జున్ షార్ట్స్ ధరించి వున్నారు. షార్ట్ మీదే లిఫ్ట్ లో కిందకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అవి వైరలయ్యాయి. షార్ట్ మీద ఉండటంతో దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వరా? అంటూ బన్నీ పోలీసులమీద అసహనం వ్యక్తం చేశారు. దీంతో లిఫ్ట్ లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

బాధ్యుడిని చేస్తున్నట్లు చెప్పిన పోలీసులు
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం అందుకున్న అతని తండ్రి అల్లు అరవింద్ వెంటనే అక్కడకు చేరుకొని ఎవరికో ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బన్నీతోపాటు అతని తండ్రి అరవింద్ కూడా పోలీసు వాహనంలోనే స్టేషన్ కు వెళ్లారు. భార్య కంగారుపడుతుండటంతో ఆమె నుదుటిపై అల్లు అర్జున్ ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. కాఫీ తాగి పోలీసు వాహనంలో స్టేషన్ కు వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద నాలుగోతేదీ రాత్రి బెనిఫిట్ షో వేయగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ తోపాటు పుష్ప2 టీం అక్కడకు వచ్చింది. ఈ సందర్భంగా లోయర్ బాల్కనీలో తొక్కిసలాట జరిగి రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతిచెందింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ బాబు పరిస్థితి సీరియస్ గా ఉంది. రేవతి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications