కెరీర్ తోపాటు సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఉండాలి.!డీజీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి.!
హైదరాబాద్: దేశ నిర్మాణంలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశం అభివృద్ధి, పురోగమనం తోపాటు సామాజిక సంస్కరణనలను తీసుకు రావడంలో యువతదే ప్రధాన పాత్ర అని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. అక్షయ విద్య స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నేడు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్ టాప్ లను డీజీపీ అంజనీ కుమార్ అందచేశారు. ఐజి రమేష్ రెడ్డి, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద భవనాల నిర్మాణం మాత్రమే కాదు : ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. కస్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చెడు మార్గాలలో పయనిస్తున్న తమ తోటి యువకులను గుర్తించి వారిని సరైన మార్గంలో పయనించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద భవనాల నిర్మాణం మాత్రమే కాదని, సమాజంలోని అట్టడుగు వర్గాలను అభివృద్ధి పథంలోకి తేవడం కూడా ప్రధానమని తెలిపారు. యువత మంచి ఉద్యోగాలు సాధించిన అనంతరం ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేసుకోవాలని డీజీపీ అన్నారు.

యువత చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారు : ఒక దేశపు యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఇదే సమయంలో కొంతమంది యువత చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారని, వారిని మార్చేందుకు చిత్త శుద్దితో ప్రయత్నించాలని యువతను కోరారు. తెలంగాణా రాష్ట్రం, దేశంలో 5వ అతిపెద్ద ఆర్థికాభివృద్దిని కలిగిఉన్న రాష్ట్రమని, కస్టపడి చదివితే ఐటి, ఫార్మా, మానవ వనరుల రంగాల్లో అత్యధిక ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగమైనా, క్రీడా రంగమైనా ఏ ఇతర రంగాలైన పురోగమించాలంటే యువతదే కీలక పాత్ర అని డీజీపీ అన్నారు.

యువతీ, యువకులకు లాప్ టాప్ లను పంపిణీ : ఈ పాత్రను సరిగ్గా పోషించడంలో యువతకు సహాయం చేయడంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని డీజీపీ అన్నారు. ఈ సందర్బంగా సింగరేణి కాలనీ, రాసూల్ పురా తదితర బస్తీలకు చెందిన యువతీ, యువకులకు లాప్ టాప్ లను పంపిణీ చేశారు. ఐఐటి ఖరగ్ పూర్ లో సీట్ సాధించిన రమేష్ అనే యువకుడిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద, హేమా ప్రతాప, అరుంధతి, జనార్దన్, మనోజ్ గుప్త, ప్రకాష్ లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications