ఆమ్నీషియా పబ్ మైనర్ గ్యాంగ్ రేప్; నిందితుల్లో ఓ ఎమ్మెల్యేకొడుకు, వక్ఫ్ బోర్డుచైర్మన్ కొడుకు?
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నగరానికి చెందిన ఓ వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతనితో పాటుగా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై సామూహిక అత్యాచారం కేసు
గత నెల 28వ తేదీన హైదరాబాద్‌లో ఆమ్నీషియా పబ్ వద్ద ఓ మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు మెర్సిడెస్ బెంజ్ కారులో తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడి ప్రమేయం ఉందని , నేరంలో పాల్గొన్న నిందితులందరూ మైనర్లేనని పోలీసు వర్గాలు తెలిపాయి. జూన్ 1వ తేదీ బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను ధృవీకరించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గ్యాంగ్ రేప్ కేసులో ఒక ఎమ్మెల్యే కుమారుడు, మైనారిటీ బోర్డు ఛైర్మన్ కుమారుడు ఉన్నారా?
ఈ ఘటన మే 28వ తేదీన చోటుచేసుకుంది. తొలుత ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇప్పుడు ఈ కేసుకు IPC సెక్షన్ 376 (గ్యాంగ్ రేప్) కూడా జోడించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు మరియు మైనారిటీ బోర్డు ఛైర్మన్ కుమారుడు ఈ గ్యాంగ్ లో ఉన్నారని మరియు అమ్మాయితో కలిసి ఉన్నారని సమాచారం. ఇక ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక స్టేట్ మెంట్ ఇలా.. గ్యాంగ్ రేప్ పై బాలిక తండ్రి ఫిర్యాదు
ఒక రెస్టారెంట్ లో కాలేజ్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నామని, పార్టీలో కొందరు యువకులు తనను బలవంతంగా బెంజ్ కారులో తీసుకు వెళ్లారని బాలిక పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిందంటూ స్టేట్మెంట్ ఇచ్చిన బాలిక తనను సాయంత్రం ఐదు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకు వెళ్లారని, రాత్రి 7 గంటలకు జూబ్లీహిల్స్ దగ్గర వదిలి పెట్టారని తెలిపింది. కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది. తనకు మెడ దగ్గర తీవ్ర గాయాలయ్యాయని, అది గమనించిన తండ్రి ప్రశ్నించడంతో విషయం చెప్పానని బాలిక తెలిపింది. దీంతో తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా వెల్లడించింది.

సీసీ టీవీ ఫుటేజ్ తో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
అయితే సిసిటివీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాలిక పార్టీకి వెళ్లడాన్ని, ఆ తర్వాత పబ్ నుండి బయటకు రావడాన్ని, ఆ తర్వాత బెంజ్ కార్ లో యువకులతో కలిసి వెళ్లడాన్ని గుర్తించారు. అక్కడినుండి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం, ఆ తర్వాత ఇన్నోవా కార్ లో పబ్ కు రావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications