హీరో విశ్వక్ సేన్‌పై తెలంగాణ మంత్రికి యాంకర్ దేవీ నాగవల్లి ఫిర్యాదు: ఇదేం పద్ధంటూ తలసాని ఆగ్రహం
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన వ్యవహారశైలితో వివాదాస్పదమవుతున్నారు. తాజా ఘటనలు ఆయనపై విమర్శలకు దారితీశాయి. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో, ఆ తర్వాత ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌లో ఓ ఇంటర్వ్యూకి వెళ్లి ఆ ఛానల్ యాంకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారాయి.

దేవి నాగవల్లిపై విశ్వక్ సేన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
విశ్వక్ సేన్ తన తాజా చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం ప్రమోషన్స్‌లో భాగంగా ప్రాంక్ వీడియో చేసి వివాదంలో చిక్కుకున్న తెలిసిందే. ఈ ప్రాంక్ వీడియోపై తెలుగు టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించగా.. ఆ ఛానల్ యాంకర్‌కు, విశ్వక్ సేన్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆవేశానికి గురైన విశ్వక్ సేన్ ఓ అభ్యంతరకర పదం వాడటం విమర్శలకు దారితీసింది. దీంతో సదరు యాంకర్ అతడ్ని గెట్ ఔట్ అంటూ బయటకు పంపారు.

మంత్రి తలసానికి దేవి నాగవల్లి ఫిర్యాదు
కాగా, ఈ నేపథ్యంలో ఆ టీవీ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విశ్వక్ సేన్‌పై ఫిర్యాదు చేశారు. దేవీ వెంట జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కూడా ఉన్నారు. దేవి ఫిర్యాదుపై మంత్రి తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

విశ్వక్ సేన్ ప్రవర్తన సరిగా లేదన్న మంత్రి తలసాని
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఓ సినిమా గురించి ప్రమోషన్స్ నిర్వహించుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడతానని చెప్పారు. యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్సేన్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని కూడా తాను చూశానని తెలిపారు. అలాంటి ప్రవర్తనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. త ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
విశ్వక్ సేన్‌పై చర్యలు తీసుకుంటామన్న మంత్రి తలసాని
యాంకర్ దేవీ నాగవల్లి కొన్ని అంశాలపై మాట్లాడుతుంటే.. అతడు మరో రకంగా సమాధానం చెప్పడాన్ని సభ్యసమాజం హర్షించదని మంత్రి తలసాని తెలిపారు. మన కుటుంబాల్లోనూ ఆడవాళ్లు ఉంటారని, ఓ ఆడకూతుర్ని ఈ విధంగా అవమానించడం సరికాదన్నారు. ఈ విషయంపై ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడతానని మంత్రి తలసాని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఏదో లైట్‌గా తీసుకుంటూ మీడియా సమావేశంలో యాంకర్ కు క్షమాపణలు చెప్పడం కూడా సరికాదని విశ్వక్ సేన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications