బండి భగీరథ్ పోక్సో కేసుతో పాటు కొత్త పార్టీపై నోరువిప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చివరకు పెదవి విప్పారు. తన కుమారుడి చుట్టూ తిరుగుతున్న వివాదాలు, ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో కొత్త పార్టీ పెడతానని వస్తున్న వార్తలపై స్పందించారు.
కొత్త పార్టీ వార్తలపై బండి సంజయ్ చెప్పిందిదే
తాను భారతీయ జనతా పార్టీని వీడి సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన తీవ్రంగా ఖండించారు.చనిపోయినా నాపై కాషాయ జెండానే ఉండాలి అన్నారు బని సంజయ్ . తాను బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే ఒక సాదాసీదా నిబద్ధత గల కార్యకర్తనని బండి సంజయ్ స్పష్టం చేశారు. జాతీయవాద భావజాలం ఉన్న తాను కొత్త పార్టీ పెడతాననడం కేవలం ప్రత్యర్థుల మైండ్ గేమ్ మాత్రమేనని కొట్టిపారేశారు.

తన రాజకీయ ప్రస్థానం ఈ పార్టీలోనే ముగుస్తుంది
ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని, అలాగే ఒక నిజమైన బీజేపీ కార్యకర్తను అడిగితే తను మరణించిన తర్వాత భౌతికకాయంపై కాషాయ జెండాను కప్పాలని కోరుకుంటాడని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తాను కూడా అదే కోరుకుంటానని, తన రాజకీయ ప్రస్థానం ఈ పార్టీలోనే ముగుస్తుందని తేల్చి చెప్పారు. తన కుమారుడు భగీరథ్ ఎదుర్కొంటున్న కేసు గురించి బండి సంజయ్ మాట్లాడుతూ, చట్టంపై మరియు న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
కన్నకొడుకుని పోలీసులకు అప్పగించిన తండ్రిని
ఈ సమాజంలో ఏ కన్నతండ్రి అయినా తన సొంత కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.వివాదం గురించి తెలిసిన వెంటనే, విచారణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో తానే స్వయంగా చట్టపరమైన ప్రక్రియకు సహకరిస్తూ కొడుకును పోలీసుల ఆధీనంలోకి పంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారు
కుమారుడి వివాదాన్ని సాకుగా చూపి తనను కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న గులాబీ పార్టీ నాయకులపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటులో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేరని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరవెనుక ఉండి ఒక పెద్ద 'ఫేక్ మీడియా ఫ్యాక్టరీ'ని నడుపుతున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం
తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ అహంకార పాలనను, గడీల వైభవాన్ని కూకటివేళ్లతో పెకలించింది తామేనన్న కోపంతోనే.. సోషల్ మీడియా ద్వారా తమపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కుట్రలతో తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications