పొన్నంపై వ్యాఖ్యలకు బండి సంజయ్ వివరణ: మంత్రికి ఎంపీ సవాల్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం చిగురుమామిడిలో పర్యటించిన ఆయన.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం ప్రభాకర్ అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో తాజాగా, బండి సంజయ్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. ఏదో అలజడి సృష్టించి, యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నిలబెట్టాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే పొన్న సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు బండి సంజయ్.
కాగా, బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతకుముందు సిద్దిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద బీజేపీ - కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఈ నేపథ్యంలో ప్రజాహిత క్యాంప్ వైపునకు వెళ్లనీయకుండా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
క్యాంప్ వైపు కాంగ్రెస్ నేతలు కర్రలతో వచ్చారని, అయినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయరని బీజేపీ నేతలు ప్రశ్నించారు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఆయనకు మద్దతుగా పార్టీ శ్రేణులు బొమ్మెనపల్లి వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే, పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బండి సంజయ్‌కు మద్దతుగా ప్రజాహిత క్యాంప్ సైట్ వద్దకు చేరుకుంటున్న బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ యాత్రను అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా తమను అడ్డుకోవడం ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications