బీజేపీలో ప్రకంపనలు: మొహమాటాల్లేవ్.. వాళ్ళను మార్చే పనిలో బండి సంజయ్!!
పనితీరు సరిగా లేని బాధ్యులను మార్చాలని బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు బండి సంజయ్ ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్న బిజెపి సంస్థాగతంగా పార్టీలో మార్పు చేర్పులకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న పదాధికారులు, జిల్లా అధ్యక్షులకు టెన్షన్ పుట్టిస్తుంది. పనితీరును బట్టి బాధ్యులను మార్చాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎలాంటి మొహమాటలు లేకుండా పనిచేయని వాళ్ళని పక్కన పెట్టాలని, బండి సంజయ్ ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసుకోవడానికి అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.

ఎన్నికలకు బండి సంజయ్ కు అధిష్టానం ఆదేశం
రాష్ట్రంలో బిజెపికి ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉంది. ఇక ఈ సానుకూల వాతావరణాన్ని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, ఎన్నికలకు సన్నద్ధం కావడానికి, దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి కావలసిన స్పీడ్ ప్రస్తుతం ఉన్న తెలంగాణ బిజెపి టీమ్ లో లేదని అగ్రనాయకత్వం భావిస్తుంది.
మరో తొమ్మిది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, నామమాత్రంగా పని చేసే వారిని పక్కనపెట్టి, ప్రజాక్షేత్రంలో బలంగా వెళ్లగలిగిన నాయకులకు అవకాశం ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు బండి టీమ్ ను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే బండి సంజయ్ కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

పార్టీలో అధ్యక్షుల మార్పుపై జోరుగా సాగుతున్న చర్చ
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఆదేశాల మేరకు బండి సంజయ్ కూడా టీం లో మార్పులు, చేర్పులు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. సంస్థాగతంగా పార్టీకి 38 జిల్లాలు ఉండగా, వీటిలో సగానికి పైగా జిల్లా అధ్యక్షుల పనితీరు మెరుగ్గా లేదని భావిస్తున్నారు. ఇక జిల్లా కమిటీల నాయకుల పనితీరు సరిగా లేదని అందుకున్న నివేదికల మేరకు దాదాపు 20 నుండి 25 జిల్లాల బిజెపి అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.

మొహమాటాలు వద్దు.. వాళ్ళను మార్చండి
ఇక ప్రస్తుతం బిజెపి రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజా గోస బిజెపి భరోసా వీధి సమావేశాలను నిర్వహిస్తున్న నాయకుల సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ మీటింగ్ లపై దృష్టి సారించిన సునీల్ బన్సల్ సరిగ్గా పని చేయని నాయకులను పక్కన పెట్టాలని, ఎలాంటి మొహమాటాలు వద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పనిచేయని అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కూడా మార్చాలనే అభిప్రాయంతో బండి సంజయ్ ఉన్నట్టు సమాచారం.

బీజేపీలో మార్పుల ప్రకంపనలు
ఏది ఏమైనా పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టి వచ్చే ఎన్నికలకు బలమైన టీం తో రంగంలోకి దిగాలని భావిస్తున్న బండి ఎలక్షన్ టీం తయారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బిజెపి మిషన్ 90 సక్సెస్ కావాలంటే నేతలు బలంగా పనిచేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం.
ఇక బిజెపిలో మార్పుల ప్రకంపనల నేపథ్యంలో బండి సంజయ్ ఎవరికి పట్టం కడతారు? ఎవరికి ఉద్వాసన పలుకుతారు? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ మార్పులే జరిగితే బీజేపీలో ఆపై చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న చర్చ కూడా జరుగుతుంది.












Click it and Unblock the Notifications