కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై తేల్చేసిన బండి సంజయ్
హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. భారతీయ జనతా పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో బీజేపీకి ప్లస్సే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీపై అవినీతిపై పోరాటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టు రాజకీయాలను ముందునుంచీ వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై బండి సంజయ్
త్వరలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని, చేరిక తేదీని కూడా తొందరలో ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాకతో బీజేపీ మరింత బలపడుతుందని, ప్రజల్లో ఇంకా నమ్మకం ఏర్పడుతుందన్నారు. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బండి సంజయ్ కి ఫోన్ చేసినట్లు సమాచారం. బీజేపీలో చేరికపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.
ఇప్పటికే తాను బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే.. నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి మరింత కలిసివచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఆశిస్తున్నారు.

బీజేపీకి సానుకూలంగా తెలంగాణ ప్రజలు: బండి సంజయ్
మరోవైపు, మలివిడత పాదయాత్ర సన్నాహక సమావేశం పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏర్పాట్లపై కమిటీ బాధ్యులతో బండి సంజయ్ చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్.
ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన మార్పు వచ్చిందన్నారు సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తక్కువ అంచనా వేశాయన్నారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications